Jagtial | బాకీలు కడతారా లేదా? రైతులకు కోర్టుల నుంచి నోటీసులు

Jagtial రుణమాఫీ ఏమైందంటున్న రైతులు వడ్డీ కలిసి బకాయిలు తడిసి మోపెడు ఆందోళననే శరణ్యమంటున్న రైతులు విధాత బ్యూరో, కరీంనగర్: రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితం అవుతోంది. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. రుణమాఫీకి సంబంధించి.. బడ్జెట్‌లో అరకొర నిధులే కేటాయించారు. ఆ నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులు కోర్టు […]

  • Publish Date - June 9, 2023 / 01:15 PM IST

Jagtial

  • రుణమాఫీ ఏమైందంటున్న రైతులు
  • వడ్డీ కలిసి బకాయిలు తడిసి మోపెడు
  • ఆందోళననే శరణ్యమంటున్న రైతులు

విధాత బ్యూరో, కరీంనగర్: రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితం అవుతోంది. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. రుణమాఫీకి సంబంధించి.. బడ్జెట్‌లో అరకొర నిధులే కేటాయించారు. ఆ నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులు కోర్టు నోటీసులు అందుకుంటున్నారు.

జగిత్యాల జిల్లాలో మేడిపల్లితో పాటు మరికొన్ని మండలాల్లో ఇలా నోటీసులు అందడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లక్ష వరకూ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకూ మాఫీ అవ్వకపోగా.. నోటీసులు రావడంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక రైతుకు 80 వేల రుణానికి సంబంధించి, వడ్డీ కలుపుకొని లక్షా 90వేలు కట్టాలంటూ నోటీసు వచ్చింది. దీంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణామాఫీకి సంబంధించిన నిధులను బ్యాంకులకు కట్టకపోతే తాము నిరాహార దీక్షకు దిగుతామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.

ఎందుకీ జాప్యం..

రాష్ట్రంలో వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించి 36.80 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేయాలంటే 25 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దీనిని నాలుగు దశల్లో అమలు చేయాలని నిర్ణయించింది. తొలుత 25 వేల లోపు రుణాలున్న మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది.

రెండో దశలో 50వేల లోపు రుణం తీసుకున్న ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాలను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయలేక పోయింది. 2023-24 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం రుణమాఫీ కోసం కేటాయించింది 6,385 కోట్లు మాత్రమే.

ఇది రుణమాఫీకి అవసరమైన సొమ్ములో మూడో వంతు కావడంతో ప్రభుత్వ హామీ అటకెక్కింది. రుణమాఫీలో జరుగుతున్న జాప్యం కారణంగా తెలంగాణలో ఇప్పటివరకు 16 లక్షల మంది రైతులు బ్యాంకులలో ఎగవేత దారులుగా మిగిలిపోయారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండగా, బ్యాంకర్లు మాత్రం తమ పని తాము చేసుకొని పోతున్నారు.

తాజాగా జగిత్యాల జిల్లాలో అనేకమంది రైతులకు రుణాల బకాయిల చెల్లింపుకై కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. ప్రభుత్వ రుణమాఫీ పై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇది శరాఘాతంలా మారింది. దీంతో రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

Latest News