Kaleshwaram Project
- కాళేశ్వరం,వరంగల్, మంథని రాకపోకలు బంద్
- మంథనిలో “పుట్ట” దంపతుల సహాయక చర్యలు
- క్యాంప్ ఆఫీసులో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
- రక్షించండి మహోప్రభు అంటూ గోపాలపురం బాధితుల ఆర్తనాదాలు
- భూపాల పల్లిలో చుట్టుముట్టిన వరద నీరు
- హాహా కారాల మధ్య మోరంచపల్లె ప్రజానీకం
- మరో ప్రక్క మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
- ఊరూరా పోలీసుల కమ్యూనిటీ సభలు
విధాత, కరీంనగర్ బ్యూరో: కుండపోతలా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తూర్పు అటవీ ప్రాంతం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. వరదలతో ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నారు. దంచి కొడుతున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 353 సి జాతీయ రహదారిపై వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దాంతో కాళేశ్వరం, వరంగల్, మంథని రహదారిపై వాహనాలను ఎక్కడికి అక్కడే నిలిపివేశారు.
మరో ప్రక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కి భారీగా వరద పోటు పెరిగింది. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సమీక్షిస్తోంది. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఆయన సతీమణి మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలతో పాటు అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు వరద పరిస్థితిని సమీక్షిస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం కురిసిన కుండపోత వర్షానికి మంథని నియోజకవర్గం లోని మానేరు అవతలి మండలాలైన మలహర్, కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల అతలాకుతలమయ్యాయి. దంచి కొడుతున్న వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రహదారులపైకి నీళ్లు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
మలహర్ మండలంలో మానేరు ఉపనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మండలంలోని కుంభంపల్లి గ్రామంలోకి వరద నీరు గంట గంటకు పెరిగుతున్నాయి. కాటారం మండలంలోని దామరకుంట, విలాసాగర్ గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మహముత్తారం మండలం, కాటారం మండలాల మధ్య గల చింతకాని వాగు, దోబ్బలపాడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మకు వెళ్లేదారిని పూర్తిగా మూసివేశారు.
మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి వద్ద లోలెవెల్ కల్వర్టుపై వరద ఉధృతి పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాల మూలంగా మేడిగడ్డ బ్యారేజ్ కి వరద తాకిడి ఎక్కువైంది. మహారాష్ట్ర చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుంచి భారీగా వరద నీరు కాళేశ్వరం వద్ద గోదావరిలో కలవడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి త్రివేణి సంగమం ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో బారెజ్ గేట్లను పూర్తిగా ఎత్తివేసి దిగువనకు నీటిని వదులుతున్నారు.
పలిమెల మండలంలోని లోతట్టు ప్రాంతాలైన పంకెన, పలిమెల, నీలం పెల్లి, బూరుగుగూడెం తదితర ప్రాంతాలకు వర్షపు నీరు తో పాటు వరద నీరు గ్రామాలకు నలదిక్కుల వచ్చి చేరుతోంది. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామం గురువారం తెల్లవారుజామున వచ్చిన వరద నీటితో పూర్తిగా మునిగి పోయింది.
దాంతో గ్రామంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎత్తైన ప్రదేశాల్లోకి, భవంతులపైకి ఎక్కి తలదాచుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది వరదలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ పుల్లా కరుణాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమై క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
బోట్లు, నాటు పడవల సహాయంతో రెస్క్యూ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూపాలపల్లి కేంద్రంలో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరి చేరడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బయటకు ఎవరు రాకూడదని వర్షం, వరద తాకిడి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ పోలీసులు మైకుల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మరో ప్రక్క వరంగల్ నుంచి భూపాలపల్లికి వచ్చే రహదారిలో పరకాల వద్ద చలివాగు, మొరంచవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బస్సులను, వాహనాలను ఎక్కడికి అక్కడే ఆపివేశారు. ఇసుక లారీలు నిలిచిపోయాయి. డ్రైవర్లు, క్లీనర్లు ఆచూకీ తెలియ రావడం లేదు. దీంతో దండకారణ్యంలోని పల్లెలన్నీ జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. గ్రామ ప్రజలను రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్ సహాయ చర్యలను చేపట్టనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా మీడియాకు వెల్లడించారు.
ఇదిలా ఉండగా జూలై 28 నుంచి ఆగస్టు 2 తారీకు వరకు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడానికి సమాయత్తమవుతుండగా, అందుకు దీటుగా పోలీసు యంత్రాంగం ఊరూరా పోలీసు కమ్యూనిటీ కార్యక్రమాల పేరుట సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఓ పక్క వానలు, మరోపక్క అన్నలు, పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వానలతో ప్రజలు రోడ్ల పైన కనిపించకుండా ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు.