Site icon vidhaatha

కాంగ్రెసులో బహిర్గతమైనగ్రూప్‌వార్‌.. పరకాలలో కొండా అనుచరుల గొడవ

విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ పార్టీలోని గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రశాంతంగా జరుగుతున్న సమావేశంలో మంత్రి కొండా సురేఖ వర్గానికి చెందిన నాయకులు గొడవకు దిగారు. పరకాల నియోజకవర్గంలో తమ వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గొడవకు దిగడంతో మిగిలిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలోనే పరకాల టికెట్ కూడా తమకే కావాలంటూ కొండా మురళి కోరిన సమయంలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఇనుగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య విభేదాలు పెరిగాయి. ఇద్దరి మధ్య బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ లభించింది. రేవూరి విజయానికి వెంకట్రాంరెడ్డి తీవ్రంగా శ్రమించారు. ప్రతిఫలంగా వెంకట్రామిరెడ్డిని కుడా చైర్మన్ గా ఇప్పటికే నియమించారు. ఈ నేపథ్యంలో పరకాల నియోజకవర్గంలో తమ ఉనికి కోల్పోతున్నట్లు భావించిన కొండ మురళి వర్గం కాంగ్రెస్ సమావేశంలో గొడవకు దిగారు. జై కొండా అంటూ నినాదాలు చేస్తూ, గందరగోళం సృష్టించిన కొండా వర్గం నాయకుడిపై మిగిలిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేయి చేసుకున్నారు. సభలోనే లొల్లికి కారణమైన గజ్జి విష్ణును కాంగ్రెస్ పార్టీనుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ చేసినందుకు నిరసనగా ప్రధాన రహదారిపై గజ్జి విష్ణు అనుచరుల ధర్నా చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని గజ్జి విష్ణును అరెస్టు చేసి
నిరసనకారులను చెదరగొట్టారు.

Exit mobile version