Koonanneni Sambasivarao | మిత్ర ద్రోహులు.. మీరా మాకు నీతులు చెప్పేది: కూనంనేని

గతంలో మీ పొత్తుల సంగతేమిటి..? బీఆరెస్ పై కూనంనేని నిప్పులు Koonanneni Sambasivarao | విధాత: మిత్ర ధర్మాన్ని విస్మరించి గతంలో మాతో పొత్తులు పెట్టుకొని మేము పోటీ చేసిన దగ్గర కూడా మీ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టిన మిత్ర ద్రోహులైన బీఆరెస్ నాయకులకు పొత్తులపై మాకు నీతులు చెప్పే స్థాయి లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. పొత్తులపై మమ్మల్ని విమర్శిస్తున్న బీఆరెస్ నేతలు గతంలో కాంగ్రెస్, టిడిపితో ఎందుకు […]

  • Publish Date - August 24, 2023 / 08:45 AM IST

  • గతంలో మీ పొత్తుల సంగతేమిటి..?
  • బీఆరెస్ పై కూనంనేని నిప్పులు

Koonanneni Sambasivarao | విధాత: మిత్ర ధర్మాన్ని విస్మరించి గతంలో మాతో పొత్తులు పెట్టుకొని మేము పోటీ చేసిన దగ్గర కూడా మీ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టిన మిత్ర ద్రోహులైన బీఆరెస్ నాయకులకు పొత్తులపై మాకు నీతులు చెప్పే స్థాయి లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. పొత్తులపై మమ్మల్ని విమర్శిస్తున్న బీఆరెస్ నేతలు గతంలో కాంగ్రెస్, టిడిపితో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారంటూ నిలదీశారు. నిమిష నిమిషానికి మారేది మీరేనని, రాజకీయ విలువలు లేకుండా చేస్తున్నారని, కుళ్లు, కుట్రలు, వెన్నుపోటులు, శవాల మీద ఆసనాలు వేసుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

మాకు 30 సీట్లలో పదివేల ఓట్లకు పైగా ఉన్నాయని, సిపిఎంకు కూడా చాలా స్థానాల్లో నిర్ణయాత్మక స్థాయిలో ఓట్లు ఉన్నాయన్నారు. జనాలు అన్ని చూస్తున్నారని మీకు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. పొత్తుల పేరుతో బీఆరెస్ మాకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గతంలో మాదిరిగా మేము మళ్లీ ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై మిలిటెంట్ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బీఆరెస్ వాళ్లు మాతో పొత్తు వద్దు అనుకున్నప్పుడు సీట్ల ప్రతిపాదన ఎందుకు తెచ్చారంటూ ప్రశ్నించారు. బీఆరెస్, బిజెపిలను ఓడించాలని ప్రజల్లోకి వెళ్తామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, భూ పంపిణీ చేసింది కమ్యూనిస్టులేనని, కమ్యూనిస్టుల చరిత్ర లేకుండా చేయాలని అప్పటి ప్రభుత్వాలు చూసాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందన్నారు. తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైతంగ సాయుధ పోరాటాన్ని గుర్తుచేస్తూ సెప్టెంబర్ 11 నుండి 17 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.

తెలంగాణ విముక్తి పోరాటంలో బిజెపి పాత్ర లేదని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటంగా బిజెపి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ అప్పటి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో మగ్దుం మొహినుద్దీన్, షోయబుల్లాఖాన్, షేక్ బందగి ఉన్నారన్న సంగతి మరవరాదన్నారు. చరిత్రను వక్రీకరించకుండా ఇప్పటి ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని గౌరవించి సెప్టెంబర్ 17ను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగిందన్నారు.

Latest News