Liquor Price
- తగ్గిన రేటు తీసుకోమంటే కొత్త స్టాక్ లేదంటున్నారు..
- కొత్త రేట్లు అమలు చేయకపోవడంతో వైన్స్‌ల వద్ద గొడవలు
- వారం రోజులుగా సొమ్ము చేసుకుంటున్న వైన్స్ యాజమాన్యాలు
- ఎక్సైజ్ శాఖ తీరుపై మందుబాబుల అసహనం
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కరోనా సందర్భంలో పలు దపాలుగా మద్యం రేట్లు పెంచి ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం రేట్లు వసూలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇటీవల కాలంలో పెంచిన మద్యం రేట్లను కాస్త తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల మొదటి వారంలో 4న ధరలు తగ్గిస్తూ ఉతర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం క్వార్టర్ బాటిల్‌కి రూ.10, హాఫ్ బాటిల్‌కి రూ.20, పుల్ బాటిల్‌కి రూ.40 తగ్గించాల్సి ఉంటుంది. ఈ నెల 4న ఉత్తర్వులు రాగా, 5 నుండి వెంటనే ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులను అమలులో పెట్టి తగ్గించిన రేట్ల ప్రకారం వసూలు చేయాల్సి ఉంది. అయితే తగ్గింపు ఉత్తర్వులు వచ్చినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు అదే పాత రేట్లను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి.
కొత్త రేట్ల అమలుపై అధికారులు ఎక్కడా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. వైన్ దుకాణాల నిర్వాహకులతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కై దందా నిర్వహిస్తూ మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పాత రేట్లనే వసూలు చేస్తున్న వైన్స్ నిర్వాహకులు
మద్యం ప్రియులు, మందుబాబులకు కాస్త ఊరట కల్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటివారంలో పలు రకాల మద్యం బాటిళ్ల రేట్లు కొంత వరకు తగ్గించినప్పటికీ అవి ఎక్కడా అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలో ఎక్సైజ్ శాఖపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో తగ్గిన మద్యం రేట్లను అమలు చేయించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఆ రీతిలో దృష్టి పెట్టక పోవడంతో వైన్ షాపుల వద్ద తరచూ వైన్స్ నిర్వాహకులతో మద్యం ప్రియులు, మందుబాబులకు ఘర్షణలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రేట్లు పెంచితే వెంటనే మరుసటి రోజు నుంచే పెరిగిన రేట్లను అమలు చేసే వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు అదే రీతిలో తగ్గించిన సందర్భాల్లో ఎందుకు తగ్గిన రేట్లు అమలు చేయడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మద్యం ప్రియుల జేబులు గుల్ల
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మందు రేట్ల బోర్డులను వైన్ షాపుల ముందు ఏర్పాటు చేసి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. రేట్లు పెరిగిన, తగ్గిన సందర్భాల్లో పెరిగినచో పెరిగిన రేట్లను, తగ్గినచో తగ్గిన రేట్లను బోర్డులపై ఏర్పాటు చేసి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి విధానం జిల్లాలో ఎక్కడా అమలులో లేదు.. అయినా అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు ఏ ఒక్కటీ కనిపించడం లేదు. ఈ నెల 4న మద్యం రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం బాబులు, మద్యం ప్రియుల విషయంలో ఎక్సెజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండడంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది.
ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు వివరణ కోరగా మద్యం ధరల విషయంలో ప్రతి రోజు మద్యం దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు.