Madhya Pradesh
- మధ్యప్రదేశ్‌లో పరువు హత్యలు.. 15 రోజుల క్రితం దారుణం
- నదిలో రెస్క్యూ ఆపరేషన్.. నేటికీ దొరకని జంట మృతదేహాలు
- మొసళ్లు, చేపలు తిని ఉండవచ్చని పోలీసుల అనుమానం
విధాత: మధ్యప్రదేశ్‌లో పరువు హత్యలు జరిగాయి. యువ జంటను 15 రోజుల క్రితం కాల్చి చంపారు. వారి మృతదేహాలకు రాళ్లు కట్టి మోరెనా జిల్లాలోని చంబల్ నదిలో పారేశారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జంట మృతదేహాల కోసం రెండు రోజులుగా నదిలో తీవ్రంగా గాలిస్తున్నాయి. అయినా, యువజంట మృతదేహాలు నేటికీ లభించలేదు. నదిలో మొసళ్లు ఉన్నాయని, అవి, చేపలు బాడీలను తిని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం..
అసలు ఏం జరిగిందంటే..
జిల్లాలోని రతన్ బాసాయి గ్రామానికి చెందిన శివానీ తోమర్(18), సమీప గ్రామం బాలుపురకు చెందిన రాధేశ్యామ్ తోమర్ (21) ప్రేమించుకున్నారు. వీరి వివాహాన్నిరెండు కుటుంబాల వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి యువ జంట కనిపించకుండా పోయింది. అబ్బాయి తల్లిదండ్రులు స్థానిక అంబా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. తమ కుమారుడు రాధేశ్యామ్‌ను శివానీ తరఫు వారు చంపేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరి పోలీసులు ఏం చేశారు..
ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. యువజంట మిస్సింగ్‌పై దర్యాప్తు మొదలు పెట్టారు. రెండు గ్రామాల్లో ప్రాథమికంగా కొందరిని ప్రశ్నించారు. అయితే, యువజంట పారిపోయి ఉంటుందని చాలా మంది తెలిపారు. దీంతో హత్య విషయాన్ని కొట్టి పారేశారు. ప్రేమికులు పారిపోయి ఉండొచ్చని పోలీసులు భావించారు. చాలా రోజులు గడిచినా యువజంట ఆచూకీ లభించకపోవడంతో జిల్లా ఎస్పీ సైతం ఘటనపై ఆరా తీశారు. అంబా పోలీసులు ఎస్పీకి కూడా జంట పారిపోయిందని తెలిపారు. వీరి వివరణను విశ్వసించని ఎస్పీ శైలేంద్రసింగ్ చౌహాన్ లోతైన దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
అమ్మాయి తండ్రి ఏం చెప్పాడంటే..
ఎస్పీ ఆదేశాలతో అంబా పోలీసులు యువతి శివానీ తండ్రిని ఠాణాకు తీసుకొచ్చి ప్రశ్నించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి తామే శివానీతోపాటు రాధేశ్యామ్‌ను కాల్చి చంపామని తెలిపాడు. అనంతరం మృతదేహాలకు రాయి కట్టి అదే రాత్రి చంబల్ నదిలో విసిరేసి వెళ్లినట్టు అంగీకరించాడు. తమ పరువు తీశారనే కోపంతోనే వారిని చంపేసినట్టు పేర్కొన్నాడు.
నేటికీ లభించని మృతదేహాలు
నిందితుడు చెప్పిన నది ప్రాంతంలో యువజంట మృతదేహాల కోసం ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు రోజులుగా గాలిస్తున్నప్పటికీ మృతదేహాలకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు వారికి లభించలేదు. మృతదేహాలు దొరికే వరకు యువ జంట హత్య జరిగినట్టుగా తాము భావించలేమని పోలీసు అధికారులు తెలిపారు.
మృతదేహాలు లభించేంత వరకు ఈ అంశంలో ఏమీ మాట్లాడలేమని ఎస్పీ వెల్లడించారు. 15 రోజు క్రితం మృతదేహాలను నదిలో పారవేసినందున మొసళ్లు, చేపలు బాడీలను తినేసి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.