విధాత: కొన్నిసార్లు జంతువులు, పక్షులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తుంటాయి. ఎవరైనా మంచి మనసున్న మనుషుల కంట అలాంటి జీవులు కనిపిస్తే కాపాడటం చూస్తూనే ఉంటాం. హత్యలు, అత్యాచారాలతో కలతపడిన గుండెను తేలికపరిచే వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. చెట్టు కొమ్మకి వేలాడుతున్న ఒక వైరు లాంటి దాంట్లో గుడ్లగూబ (owl) కాలు ఇరుక్కుపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.
పైగా అది పారుతున్న వాగుపై వేలాడుతుండటంతో. . ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితుల్లో పడింది. ప్రాణభీతితో సాయం కోసం ఆ గుడ్లగూబ అరుస్తున్నప్పటికీ.. అది అడవి కావడం వల్ల దాని అరుపు అరణ్యరోదనే అయింది.
Terrified owl was so thankful to the guy who saved his life pic.twitter.com/UecYjfnIgN
— B&S (@_B___S) June 8, 2023
కాసేపటికి అటుగా పడవ మీద వచ్చిన ఓ యాత్రికుడు దానిని చూశాడు. వెంటనే తాడుని తెంపేసి.. ఆ గుడ్లగూబకి ప్రథమచికిత్స సైతం చేశాడు.
అయితే.. తన ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గుడ్లగూబ వెంటనే ఎగిరిపోకుండా తనకు సాయం చేసిన వ్యక్తికి సెల్ఫీ సైతం ఇచ్చింది. బీకేఎస్ అనే యూజర్ దీనిని ట్విటర్‌లో పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 16 లక్షల మంది చూశారు. దీనిపై కొంత మంది యూజర్లు స్పందిస్తూ అంత దట్టమైన అడవుల్లో ఆ వైరును ఎందుకు పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.