Mahbubnagar | మహబూబ్ నగర్: ఎమ్మెల్యేల ఎదుట.. ఎన్నో సవాళ్లు.!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆరెస్ గట్టెక్కేనా? 14 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు తొలి జాబితాలోనే టికెట్ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యతిరేక వర్గాల కూటమిని ఒక్కటి చేసుకుంటారా? సమస్యల సవాళ్ళను ఎదుర్కొంటారా.. చతికిలపడతారా బీఆరెస్ గెలుపు అంత సులువు కాదంటున్న విశ్లేషకులు Mahbubnagar | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పార్టీ నుంచి టికెట్ పొందినంత సులువుగా విజయం సాధిస్తారా? సమస్యలు.. సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళతారా? అసమ్మతి నేతలను […]

  • Publish Date - August 23, 2023 / 10:56 AM IST

  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆరెస్ గట్టెక్కేనా?
  • 14 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు తొలి జాబితాలోనే టికెట్
  • కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
  • వ్యతిరేక వర్గాల కూటమిని ఒక్కటి చేసుకుంటారా?
  • సమస్యల సవాళ్ళను ఎదుర్కొంటారా.. చతికిలపడతారా
  • బీఆరెస్ గెలుపు అంత సులువు కాదంటున్న విశ్లేషకులు

Mahbubnagar |

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పార్టీ నుంచి టికెట్ పొందినంత సులువుగా విజయం సాధిస్తారా? సమస్యలు.. సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళతారా? అసమ్మతి నేతలను బుజ్జగించి తమ దారికి తెచ్చుకుంటారా?… ఇవన్నీ నియోజకవర్గాల్లో బీఆరెస్ అభ్యర్థుల ముందున్న ప్రశ్నలు. వీటన్నింటినీ దాటుకుని ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉంటేనే గెలుపు సాధ్యం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల ముందున్న ముఖ్య సమస్యలు దళితబంధు, చేతి వృత్తుల వారికి రూ.లక్ష, ఊసేలేని గిరిజన బంధు, భూదందాలు, గ్రామాల్లో తిష్ట వేసిన సమస్యలు వంటివి ఎమ్మెల్యేల గెలుపును అడ్డుకునే అవకాశం ఉంది. ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ అభ్యర్థులు ముందుకు సాగాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మాదిరిగా పట్టు నిలుపుకునేందుకు అభ్యర్థులు ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు.

నియోజకవర్గాలుగా బీఆరెస్ అభ్యర్థుల పనితీరు పరిశీలిస్తే..

మహబూబ్ నగర్ నియోజకవర్గం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఆయన 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయం పొందారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లతో గట్టేక్కిన ఆయన నియోజకవర్గంపై పూర్తి పట్టుసాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో ఘన విజయం పొంది మంత్రి పదవి దక్కించుకున్నారు. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మూడోసారి సిద్ధమవుతున్నారు.

ఈ నియోజకవర్గంలో ఆయనకు ప్లస్ లు, మైనస్ లు ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో రోడ్లు, చౌరస్తాల వద్ద పచ్చదనం, పెద్ద చెరువు సుందరీకరణ, శిల్పారామం, మయూరీ నర్సరీ ని కేసీఆర్ పార్క్గా అభివృద్ధి చేయడం వంటి పనులు ముమ్మరంగా చేపట్టడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే భూదందాలు, ఇతరులపై అక్రమ కేసులు, ఎన్నికల ఆఫిడవిట్ టాంపరింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల టాంపరింగ్ కేసు శ్రీనివాస్ గౌడ్ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. ఇక్కడ గెలుపు కోసం ఆయన శ్రమించాల్సి ఉంటుంది.

జడ్చర్ల నియోజకవర్గం

ఇక్కడి ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి మూడోసారి ఎన్నికల రణరంగంలో ఉంటున్నారు. అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి గా పేరున్న ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. మూడోసారి అసెంబ్లీ లోకి వెళ్లేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు.

దేవరకద్ర నియోజకవర్గం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ మూడోసారి టికెట్ పొంది తన రాజకీయ భవిష్యత్ కు బంగారు బాట వేసుకునేందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఈయన హయాంలో వాగులపై ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ లు నిర్మించి భూగర్భ జలాలు పెంపొందే విధంగా చర్యలు చేపట్టారు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కరివెనా జలశయంలో ఒండ్రు మట్టి తరలింపులో జరిగిన అక్రమాల్లో ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

మక్తల్ నియోజకవర్గం

ఇక్కడి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెరాస (ప్రస్తుతం బీఆరెస్ ) చేరారు. రెండోసారి తెరాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ఎంత మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎమ్మెల్యేకు కోపిష్టి గుణంతో ఆయనకు ఎదురు మాట్లాడేవారే లేరు. నియోజకవర్గంలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

నారాయణ పేట నియోజకవర్గం

ఇక్కడి బీఆరెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత తెరాసలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అత్యంత వెనుకబడిన ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ లేదు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో కంటే అధికంగా ఆయన వ్యాపారం ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయచూరులోనే ఉంటారు. చుట్టపు చూపుగా ఇక్కడకు వస్తుంటారు. ఈయన ముందు సమస్యలు చెప్పుకోడానికి ఎవ్వరూ సాహసించరు. ప్రజల మధ్యనే ఉండని ఈనేత వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టేక్కుతారో.

కొడంగల్ నియోజకవర్గం

అధికార పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై గెలిచి సత్తాచాటుకున్నారు. గెలిచిన నాటి నుంచి ఎలాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టలేదు. అసలు ఎందుకు గెలిపించామా అని నియోజకవర్గం ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

షాద్‌నగర్ నియోజకవర్గం

ఇక్కడి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రెండు సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, అభివృద్ధిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ కు దగ్గరి ప్రాంతం కావడం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఉండడంతో ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ ఈ అభివృద్ధిలో ఎమ్మెల్యే పాత్ర ఏమి లేదని, ప్రతి రియల్ వ్యాపారి వద్ద పర్సెంటెజీలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. మూడోసారి టికెట్ రావడంతో వచ్చే ఎన్నికల్లో తన భవిష్యత్ ను పరీక్షించుకుంటారు.

కల్వకుర్తి నియోజకవర్గం

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2014 లో ఓటమి చెందారు. అనంతరం తెరాసలో చేరి 2018లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధిని, పార్టీ నాయకులను పట్టించుకోలేదనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇక్కడ ఉన్న అసమ్మతిని తట్టుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారా, లేదా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం

రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మర్రి జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలే బలమైన నేతగా తీర్చిదిద్దాయి. అవినీతి ఆరోపణలు లేని ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. మూడోసారి కూడా గెలుపు తనదే అని ధీమాలో ఉన్నారు.

అచ్చంపేట నియోజకవర్గం

ఇక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ గొడవలకు అతిదగ్గరలో ఉంటారు. ఈయన నోటి దురుసుతో ఇతర పార్టీ నేతలే కాకుండా సొంత పార్టీ వారే బాధలు అనుభవించారు. నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

వనపర్తి నియోజకవర్గం

మొదటిసారి విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించారు. కొన్ని భూసంబంధిత ఆరోపణలు ఉన్నా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉండడం ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చింది. యోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరు అధించడంలో మంత్రి పాత్ర అధికంగా ఉండడంతో ఆయనకు ఏకంగా నీళ్ల నిరంజన్ రెడ్డి అనే పేరు ఉంది. రెండోసారి టికెట్ దక్కించుకోగా, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని అంటున్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గం

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన బీరం హర్ష వర్ధన్ రెడ్డి తరువాత తెరాసలో చేరారు. నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి బీఆరెస్ నుంచి పోటీలో ఉంటున్నారు. అభివృద్ధిని పట్టించుకొని ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

అలంపూర్ నియోజకవర్గం

ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ఉన్నట్లు నియోజకవర్గ ప్రజలు ఏనాడో మరిచిపోయారు. అభివృద్ధి పట్టదు, కార్యకర్తలు అంటే చులకన, గ్రామాల్లోకి రాకపోవడం వంటివి ఆయన క్వాలిఫికేషన్లుగా స్థానికులు విశ్లేషిస్తారు. ఇలాంటి ఎమ్మెల్యేకు మళ్ళీ టికెట్ రావడంతో ఎలా విజయం సాధిస్తారో వేచి చూడాలి.

గద్వాల నియోజకవర్గం

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో అంతంత మాత్రమే అనే పేరుంది. రెండోసారి టికెట్ రావడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.

Latest News