Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. మంత్రివర్గ విస్తరణ, హెచ్ సీయూ భూముల వివాదం వంటి అంశాల నేపథ్యంలో రాష్ట్రానికి మీనాక్షి నటరాజన్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయంత్రం 5 గంటలకు హెచ్ సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీతో మీనాక్షి నటరాజన్ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఆమె సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశానికి హాజరవుతారు. హెచ్ సీయూ భూముల వివాదంతో నెలకొన్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ వారితో చర్చించనున్నారు.
అనంతరం గాంధీ భవన్ లో ఎన్ఎస్ యూఐ నాయకులతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె హైకమాండ్ ప్రతినిధిగా ప్రభుత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి సూచనలిచ్చే అవకాశముంది.
మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి మార్గదర్శకం చేయవచ్చని భావిస్తున్నారు. దీంతో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.