Site icon vidhaatha

MGM: 4 దశాబ్దాలుగా మారని MGM తలరాత.. కనీస వసతులు శూన్యం: మాజీ కలెక్టర్ మురళి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉత్తర తెలంగాణకే పెద్దదిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస వసతులు లేవని సోషల్ డెమొక్రటిక్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆసుపత్రిని సోమవారం డాక్టర్ ఎస్ పృధ్విరాజ్‌తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని రోగులకు అందుతున్న వైద్యం, రోగులపై ఉన్న వైద్యుల పర్యవేక్షణ పై సంబంధిత సమస్యలపై ఆరా తీశారు. అత్యవసర విభాగంలో ఉండవలసిన వైద్యులు అందుబాటులో ఎందుకు లేరని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. అత్యవసర విభాగంలో డ్యూటీ డాక్టర్స్ చార్ట్ పరిశీలించి, డ్యూటీ డాక్టర్స్ లిస్టు చార్ట్ లో పేర్కొనక పోవడంతో ఆయన దగ్గరుండి లిస్టులో రాయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్ల క్రితం ఎంజీఎం హాస్పిటల్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అన్నారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు ఎవరూ లేరని హాస్పిటల్ మొత్తం పీజీ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వైద్యులతో వెళ్లదీస్తున్నారని విమర్శించారు.

సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఎమ్మారై లేకపోవడం బాధాకరమన్నారు. కనీస పరిశుభ్రత లేదని అందుకే 40% ఆదరణ లేదని దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అని విమర్శించారు.

Exit mobile version