Minister Harish Rao
విధాత: తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అన్ని కులాలు, మతాల ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దళిత బంధు, బీసీ బంధు అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మైనార్టీలకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని మైనార్టీలకు కూడా బీసీ బంధు మాదిరిగానే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ క్రమంలోనే మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గుడ్ న్యూస్ చెప్పారు. పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తాం. మైనార్టీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మైనార్టీ చైర్మన్ల అభినందన సభలో హరీశ్‌రావు ఈ విషయాన్ని ప్రకటించారు.