పదేళ్లుగా ఎందుకు మౌనం: జూపల్లి

బీఆరెస్ పదేళ్ల పాలనలో నదీ జలాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు

  • Publish Date - February 12, 2024 / 11:47 AM IST

  • గోదావరి పేరుతో మభ్యపెట్టవద్దు : తుమ్మల


విధాత : బీఆరెస్ పదేళ్ల పాలనలో నదీ జలాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. నీటి సమస్యలు పరిష్కరించకుండా కేంద్రానికి ఎందుకు మద్దతు తెలిపారని నిలదీశారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు బీఆరెస్ ప్రభుత్వం న్యాయమైన తెలంగాణ వాటా సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బుకాయిస్తున్నారు.


కేసీఆర్‌కు, చంద్రబాబు రాజకీయంగా సరిపడదన్న కారణంతో ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్ భావించారని, జగన్‌కు రాజకీయ లబ్ది కలగాలనే కేసీఆర్ ప్రాజెక్టులపై సహకరించారని, రాయలసీమ ఎత్తిపోతలకూ మద్దతిచ్చారని జూపల్లి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కేంద్రం వద్ద బీఆరెస్ ఎందుకు మోకరిల్లిందంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదని హరీశ్ రావు చెప్పగలరా అని, ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై నేను ఆధారాలు చూసిస్తానని, అప్పట్లో నిపుణులు విద్యాసాగర్ రావు సాగునీటి మంత్రిగా ఉంటే ఇంత అవినీతి జరిగి ఉండేది కాదన్నారు.


మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ బీఆరెస్ పాలకులు ఏపీ జల దోపిడికి సహకారం అందించారని విమర్శించారు. శ్రీశైలంకు గోదావరి నీళ్లు వస్తాయన్న ఊహాజనిత వైఖరితో ఏపీ జలదోపిడికి, అక్రమ ప్రాజెక్టులకు మద్దతునివ్వడాన్ని సమర్ధించుకోలేరన్నారు. గోదావరి జలాల్లో, కృష్ణా నది జలాల్లో కేటాయింపులనే సద్వినియోగం చేసుకోలేపోతుందని, ఇక ఊహజనిత పథకాల పేరుతో నీటి హక్కులు వదులుకోవడం బీఆరెస్ తప్పిదమన్నారు.

Latest News