Site icon vidhaatha

ఎమ్మెల్యే కంచర్ల నాపైన, నా అనరుచరులపైన పోలీసులను ఉసిగొల్పుతున్నాడు: పిల్లి రామరాజు

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ నియోజక వర్గ పరిధిలో ప్రజల వద్దకు, వినాయక విగ్రహాల దగ్గరకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అనేక ఆటంకాలు సృష్టిస్తూ రాజకీయ ప్రోద్భలంతో అడ్డుపడుతూ నన్ను, నా కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్న కనగల్ మండల ఎస్ఐ, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ చైర్మన్, బీఆరెస్‌ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక నల్లగొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డికి కనగల్ మండల ఎస్సై అంతిరెడ్డి పైన, ఇతర పోలీసులపైన ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పిల్లి రామరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపధ్యంలో నల్లగొండ నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సంసిద్ధులుగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ ప్రజలకు వినాయక విగ్రహాలు ఇప్పించి ఉన్నారన్నారు. నేను కూడా నల్లగొండ నియోజక వర్గం లోని వివిధ గ్రామాల ప్రజలకు, పట్టణ పరిధిలోని వివిధ వార్డుల ప్రజలకు విగ్రహాలు ఇప్పించానన్నారు.

అక్కడి ప్రజలు నన్నువిగ్రహాల వద్దకు పూజా కార్యక్రమాలలో పాల్గొనమని పిలిచినప్పుడు నేను నా కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నానన్నారు. ఈ క్రమంలో సందర్భంలో గురువారం ధర్వేశిపురం గ్రామానికి సంబంధించిన ప్రజలు, యువకులు నన్ను ఆహ్వనించి, నాకు స్వాగతం పలికి, వారు తెచ్చుకున్న సౌండ్ తో కూడిన వాహనంతో ధర్వేశిపురం లోకి ఊరేగింపుగా వెలుతుండగా కనగల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ అంతిరెడ్డి, ఆయన పోలీసు బృందం మమ్మల్ని అడ్డుకున్నారన్నారు. 

గ్రామానికి చెందిన తన మద్ధతుదారులైన ఎనిమిది యువకుల ఇండ్లలోకి వెళ్లి మొబైల్ ఫోన్లు లాక్కొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినారన్నారు. ఒక బహుజన నాయకుడిగా నాకు ప్రజలలో ఆదరణ పెరుగుతున్న క్రమంలో తట్టుకోలేని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నాపైన, నా అనరుచరులపైన పోలీసులను ఉసిగొల్పుతు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

తాను చట్టప్రకారమే వెలుతున్నా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో నా కార్యక్రమాలకు పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారన్నారు. కనగల్‌లో నా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన ఎస్సై, సిబ్బందిపై చర్యలు తీసుకుని, నా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలో కూడా నేను ఇప్పించిన విగ్రహాల దగ్గర మండప నిర్వాహకులను పోలీసులు బెదిరించి నా ఫ్లెక్సీలను తీసివేయించారన్నారు.

ఇదే వినాయక మండపాల విగ్రహాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే డీజే బాక్సులతో వెళితే పోలీస్ శాఖ వారు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. సామాన్యుడైనా, ప్రజా ప్రతినిధియైనా చట్టానికి ఎవరు అతీతులు కాదన్నారు. అందరికి సమానంగా చట్టం వర్తింపచేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version