Site icon vidhaatha

ఈ కారు ధ‌ర మీ ఊహ‌క్కూడా అంద‌దు.. ఎందుకింత ధ‌ర‌? ఏంటా ప్ర‌త్యేక‌త‌లు?

కేవ‌లం ముగ్గురి కోసం త‌యారుచేయ‌బ‌డ్డ ఓ కారు ఇప్పుడు ధ‌ర‌ప‌రంగా సంచ‌లనం సృష్టిస్తోంది. సాధార‌ణంగా కాస్ట్‌లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అంద‌రూ చెబుతారు. అది నిజ‌మే. ఓ పెద్ద ప‌డ‌వ‌లా హొయ‌లొలికించే కార్ల‌కు రోల్స్‌రాయిస్ ప్ర‌సిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంట‌మ్ బాగా పాపుల‌ర్‌ కార్‌. దీని విలువ దాదాపు 10 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ఇప్ప‌డు దాని తాత ఒక‌టి వ‌చ్చింది.

 

అదే రోల్స్‌రాయిస్ ‘ఆర్కాడియా డ్రాప్‌టెయిల్‌’

రోల్స్ రాయిస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును ఆవిష్కరించింది. దీని ధ‌ర అక్ష‌రాల రూ.302 కోట్లు. నిజంగానే 300 కోట్లు… ఒక్క కారుకే. ఆర్కాడియా అంటే గ్రీక్‌లో భువిపై స్వ‌ర్గం అని అర్థం. మ‌రి ఎందుకింత ధ‌ర‌? ఏంటా ప్ర‌త్యేక‌త‌లు? ఇప్పుడు చూద్దాం.

క‌ళ్లుచెదిరే రేంజ్‌లో రోల్స్ రాయిస్ అధికారికంగా డ్రాప్‌టెయిల్‌ను అవిష్క‌రించింది. ఇది ఇప్పటివరకు సృష్టించిన అత్యంత ఖరీదైన కారుగా కొత్త రికార్డును నెలకొల్పింది.ముగ్గురు అదృష్ట‌వంతులు దీన్ని ప్ర‌త్యేకంగా త‌యారుచేయించుకున్నారు. వారికి రోల్స్‌రాయిస్ నావిక్ డిజైన్ మీద చాలా ప‌ట్టుంది. అందుకే వివిధ విడిభాగాల‌ను కూడా కావాల్సిన విధంగా త‌యారుచేసారు.

 

దాదాపు ఆరు మీటర్ల పొడవు, ఫాంటమ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మించ‌బ‌డ్డ డ్రాప్‌టెయిల్‌ ప్రతి కోణం నుండి రాజ‌సాన్ని ఒలికిస్తుంది. పెద్ద నావ‌ల డిజైన్‌నుండి ప్రేర‌ణ పొందిన ఈ డిజైన్ అత్యంత అధునాత‌నంగా, అత్యంత వ్య‌యంతో రూపొందించ‌బ‌డింది. ప్రఖ్యాత రోల్స్‌రాయిస్‌-వి12 ఇంజన్‌తో డ్రాప్‌టెయిల్‌ అద్భుత‌మైన పనితీరును మాత్రమే కాకుండా అసమానమైన క‌స్ట‌మైజేష‌న్‌ కూడా కలిగి ఉంది. 1,800కి పైగా ఆర్డ‌ర్‌చేయ‌బ‌డ్డ‌ విడిభాగాలు ఎనిమిది నెల‌ల‌ పాటు సూక్ష్మంగా రూపొందించబడ్డాయి. ఇంటీరియ‌ర్స్‌ను అత్యంతఖ‌రీదైన క‌ల‌ప(నిజంగానే చెక్క‌) తో 8 వేల గంట‌ల‌పాటు ఎంతో నైపుణ్యంగా పూర్తిగా చేత్తో తీర్చిదిద్దారు. దీంతో ఇది ఆటోమోటివ్ ప్రపంచంలో సాటిలేని ప్రత్యేకతను సంత‌రించుకుంది.

 

డ్రాప్‌టెయిల్‌ యొక్క ఆకర్షణకు కేంద్రంగా వెనుక డెక్ క్రింద ఉన్న దాని ప్రత్యేకమైన “హోస్టింగ్ సూట్” ఉంది. ఐదు ECUలు మరియు తొమ్మిది నెలల పాటు రూపొందించిన కస్టమ్ వైరింగ్ జీనుతో, ఈ విలాసవంతమైన కారు ఒక్క బ‌ట‌న్ ప్రెస్‌తో ఓ పిక్నిక్ సెట్‌గా మారిపోతుంది. ఫ్రిజ్‌లు, డ్రింక్‌లు ఇంకా స్నాక్స్‌తో, ఒక పారాసోల్, టేబుల్‌లు, కుర్చీలు గ‌మ్మ‌త్తైన అనుభూతిని క‌లిగిస్తాయి.

30 మిలియన్ డాల‌ర్ల‌ (సుమారు రూ. 257 కోట్లు) క‌ళ్లుచెదిరే ధరతో, రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టెయిల్‌ ఆటోమోటివ్ లగ్జరీకి చిహ్నంగా దాని హోదాను సుస్థిరం చేస్తూ, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోరుకునే వారికి మాత్ర‌మే అందిస్తుంది. ప్ర‌స్తుతం ముగ్గురి కోస‌మే త‌యారుచేయ‌బ‌డ్డ ఈ కారు, ఇంకా ఎవ‌రైనా అడిగితే ఇస్తారో లేదో తెలియ‌దు. ఈ ముగ్గురు బెస్ట్‌లు ఎవ‌రోతెలుసుకోవాల‌నిఉందా..? నో వే. వారి పేర్లు రోల్స్‌రాయిస్ బ‌య‌ట‌పెట్ట‌లేదు.

Exit mobile version