Nizamabad | అకాల వర్షాలతో భారీ నష్టం.. రైత‌న్న‌కు క‌ష్టం

Nizamabad అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచాయి. తెల్లవారితే కోతకు వస్తాయన్న సమయంలో కురిసిన వానలకు రైతన్న కుదేలవున్నాడు. ఇటు కోతకు వచ్చిన పంటతో పాటు కోసిన ధాన్యం నీట మునిగి వరద‌లో కొట్టుకు పోవటంతో రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. ఇక […]

  • Publish Date - May 5, 2023 / 01:00 AM IST

Nizamabad

అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచాయి. తెల్లవారితే కోతకు వస్తాయన్న సమయంలో కురిసిన వానలకు రైతన్న కుదేలవున్నాడు. ఇటు కోతకు వచ్చిన పంటతో పాటు కోసిన ధాన్యం నీట మునిగి వరద‌లో కొట్టుకు పోవటంతో రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. ఇక తమను ప్రభుత్వమే ఆదుకోవాలని లేదంటే తమకు చావే శ‌రణ్యమని వేడకుంటున్నారు.

విధాత ప్రతినిధి ఉమ్మడి నిజామాబాద్: అకాల వర్షాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అన్నదాతలు ఆగమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగండ్ల వర్షం పడడంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇటు వరితో పాటు మామిడి పంటలు, కూరగాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పంట కండ్ల ముందే నీటి పాలు అవ్వడంతో రైతు కంట కన్నీరు కారుతోంది.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 70% వరకు వడ్లు రాలిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క కోసిన పంట కల్లాల్లో నీటిలో మునిగిపోయింది. వరదకు నీటిలో కొట్టుకపోయింది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులకు తట్టుకోలేక చెట్లు నేలకొరిగాయి. మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి.. నువ్వుల‌ పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం వరికుప్పలు పూర్తిగా నీటిపాలయ్యాయి.

పంట కోతల సమయంలో వర్షాలు పడడంతో ధాన్యమంతా వర్షం పాలయ్యింది. కోతకు వచ్చిన వందల ఎకరాల్లో నువ్వులు, జొన్నలు, మామిడి, కూరగాయల పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతులను వణికించింది. కల్లాలపై ఆరబెట్టిన ధాన్యం రైతుల కళ్లెదుటే వరద నీటికి కొట్టుకుపోయింది.

కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశులు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో కొనుగోళ్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. 50 వేలకు పైగా ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరుస వానలతో పొలాల్లో నీరు చేరడంతో కోత యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యమే కాకుండా.. కొనుగోలు చేసిన వడ్లు తడిశాయి. 28 కేంద్రాల్లోని 18 వేల క్వింటాళ్లు తడిసినట్లు అధికారులు గుర్తించారు.

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని పలు చోట్ల లారీల సమస్య కూడా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ధర్పల్లి మండలంలోని ఓ కేంద్రంలో ఇద్దరు రైతులకు చెందిన 75 బస్తాల వడ్లు.. వారం రోజుల క్రితం తూకం వేసినా ఇంకా తడుస్తూనే ఉన్నాయి. మరోవైపు రానున్న 4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అకాల వర్షం సృష్టించిన బీభత్సం వల్ల రైతులు కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. చేతికి వచ్చిన పంట నేలపాలయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. వడగండ్ల వాన కురిసి చేతికొచ్చిన వరి ధాన్యం రాలిపోవడంతో రైతులు చాలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి, వేల్పూర్, ఆర్మూర్, నందీపేట్, డిచ్పల్లి, బీంగల్…
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి గ్రామీణ, ఎల్లారెడ్డి, దోమకొండ బిక్కనూరు, నాగిరెడ్డిపేట్ బాన్సువాడ, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం పడడంతో పంటలు పూర్తిగా గింజ రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలిపోయిందని ఆయా మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం పై కప్పిన కవర్లను తీసేందుకు రైతులు సాహసించడం లేదు ఎప్పుడు ఎటు నుంచి వర్షం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.. రోజుల తరబడి కప్పే ఉండడంతో చాలాచోట్ల కల్లాలపై రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలపై మొలకలు వస్తున్నాయి. వరి, సజ్జ, మొక్కజొన్న, నువ్వు, మామిడి, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. పాలకులు, అధికారులు క్షేత్రాలను, కొనుగోలు కేంద్రాలను, పరిశీలించి అన్నదాతకు బాసట‌గా నిలవాల్సిన అవసరం ఉంది.

Latest News