Dharani | పేద రైతులది కాదు.. ఇది దొరల ‘ధరణి’!

Dharani | 57 యేండ్ల కింద‌టే భూమి విక్రయం కొన్నవారి వారసుల పేరిట పట్టాలు ధరణి తర్వాత మారిపోయిన సీన్‌ పాత భూస్వామి వారసులకు పాస్‌బుక్‌ ప్రస్తుత పట్టాదారులకు నోటీసులు తమ భూమి చూపాలని బెదిరింపులు ప‌ట్టించుకోని రెవెన్యూ అధికారులు ల‌బోదిబోమంటున్న బాధిత రైతులు న్యాయం కోసం ప్రభుత్వానికి వినతి హుజూర్‌నగర్‌ మండల కేంద్రంలో ధరణి దగాపై విధాత ప్రత్యేక కథనం ఒక‌ప్పుడు ఆ భూమి ఆ ఊరి దొర‌ది. ఆ భూమిని 1966లో అంటే సుమారు […]

  • Publish Date - June 10, 2023 / 01:10 AM IST

Dharani |

  • 57 యేండ్ల కింద‌టే భూమి విక్రయం
  • కొన్నవారి వారసుల పేరిట పట్టాలు
  • ధరణి తర్వాత మారిపోయిన సీన్‌
  • పాత భూస్వామి వారసులకు పాస్‌బుక్‌
  • ప్రస్తుత పట్టాదారులకు నోటీసులు
  • తమ భూమి చూపాలని బెదిరింపులు
  • ప‌ట్టించుకోని రెవెన్యూ అధికారులు
  • ల‌బోదిబోమంటున్న బాధిత రైతులు
  • న్యాయం కోసం ప్రభుత్వానికి వినతి
  • హుజూర్‌నగర్‌ మండల కేంద్రంలో
  • ధరణి దగాపై విధాత ప్రత్యేక కథనం

ఒక‌ప్పుడు ఆ భూమి ఆ ఊరి దొర‌ది. ఆ భూమిని 1966లో అంటే సుమారు 57 ఏండ్ల క్రితం ఓ రైతుకు విక్ర‌యించారు. దొర భూమిని కొనుగోలు చేసిన రైతుకు ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు కూడా ఉన్నాయి. త‌రాలు మారుతున్న కొద్దీ తాత‌ నుంచి తండ్రికి, తండ్రి నుంచి త‌న‌యుల‌పేర‌ ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు వ‌చ్చాయి. కానీ ఇంద‌తా ధ‌ర‌ణి రాక‌ముందు.

2018లో తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర‌ణిని తీసుకొచ్చి.. నూత‌న ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌ను జారీ చేసింది. 57 ఏళ్ల క్రితం భూమిని కొనుగోలు చేసినవారి పేరిట కాకుండా.. సదరు భూస్వామి వారసురాలి పేరిట పాస్‌బుక్‌ జారీ అయింది. దానిని అడ్డం పెట్టుకుని.. సదరు వారసురాలు.. సాగులో ఉన్న ప‌ట్టాదారుల‌కు కోర్టు నుంచి నోటీసులు జారీ చేశారు.

మరి ధరణి పేద రైతులదా? దొరలదా?
ధరణిలో పేద రైతు హక్కు దక్కిందా?
దొర వారసురాలికి కాలం కలిసొచ్చిందా?

బూడిద సుధాకర్‌, విధాత ప్రతినిధి, హైదరాబాద్‌: ప్ర‌స్తుత సూర్యాపేట జిల్లా, హూజూర్‌న‌గ‌ర్ మండల కేంద్రం ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్ 562లో 59 ఎక‌రాల భూమి (రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం) ఉన్నది. ఇందులో భువ‌న‌గిరి సీతారామమ్మ పేర 15.09 ఎక‌రాలు, భువ‌న‌గిరి వెంక‌ట‌న‌ర్స‌య్య పేర 16 ఎక‌రాలు, భువ‌న‌గిరి వెంక‌ట సుబ్బ‌య్యకు 16 ఎక‌రాల చొప్పున‌ సుమారు 48 ఎక‌రాల భూమి ఉన్నది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో 25 ఎక‌రాల విస్తీర్ణం మాత్రమే ఉన్నది.

1966లో ఈ భూమిపై ర‌క్షిత కౌలుదారులుగా (ప్రొటెక్టెడ్ టెనెన్సీ) ఉన్న‌ అంతిరెడ్డి (అంత‌య్య‌) అనే రైతుకు సుమారు 12 ఎక‌రాల భూమిని స‌ద‌రు భూస్వాములు విక్ర‌యించారు. ప్ర‌భుత్వం నుంచి 38 (ఈ) సర్టిఫికెట్‌ను కూడా అంతయ్య పొందారు. భూస్వాములైన సీతారామమ్మ, వెంక‌ట‌న‌ర్స‌య్య, వెంక‌ట సుబ్బ‌య్యలు మ‌రికొంత మంది రైతుల‌కు కూడా వారి భూమిని విక్ర‌యించారు. ఇందులో నుంచి కొంత భూమి నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాల్వ (ముత్యాల బ్రాంచ్ కెనాల్‌) కోసం ప్రభుత్వం సేక‌రించింది.

అయితే రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం వీరిపై మ‌రికొంత భూమి ఉండ‌టంతో 1975లో అమ‌ల్లోకి వ‌చ్చిన సీలింగ్ యాక్ట్‌ ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ ముగ్గురు భూస్వాముల‌కు నోటీసులు జారీ చేసింది. అయితే అప్ప‌టికే 562 స‌ర్వే నంబ‌ర్‌లో ఉన్నమొత్తం భూమిని ఇత‌రుల‌కు విక్ర‌యించామ‌ని, ఆ స‌ర్వే నంబ‌ర్‌లో త‌మ‌కు ఎలాంటి భూమి లేద‌ని పేర్కొంటూ అప్ప‌టి రెవెన్యూ అధికారి ముందు వాగ్మూలం కూడా ఇచ్చారు.

ధ‌ర‌ణితో తెర పైకి వార‌సురాలు

సీతారామమ్మ, వెంక‌ట‌న‌ర్స‌య్య, వెంక‌ట సుబ్బ‌య్య పేర ఉన్న భూముల‌ను 1966-1975 మ‌ధ్యకాలంలోనే పూర్తిగా ఇత‌రుల‌కు విక్ర‌యించిన‌ట్లు రెవెన్యూ అధికారి ఇచ్చిన వాగ్మూలం ద్వారా స్ప‌ష్టం అవుతున్నది. కానీ 2018లో తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం అప్ప‌ట్లో భూస్వామి అయిన సీతారామమ్మకు వార‌సురాలి పేర ధ‌ర‌ణి ద్వారా నూత‌న ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ను జారీ చేసింది.

ఈ విష‌యంపై బాధిత రైతులు అధికారుల‌ను సంప్ర‌దించ‌గా.. అంతిరెడ్డి (అంత‌య్య‌) వార‌సుడైన‌ నారాయ‌ణ రెడ్డి వార‌సుల‌ మధ్య పార్టిషన్‌ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ధ‌ర‌ణిలో ప‌ట్టాలు జారీ కాలేద‌ని చెప్పి చేతులు దులుపుకొన్నార‌ని నారాయ‌ణ రెడ్డి వార‌సులు శ్రీనివాస్ రెడ్డి, శంభీరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో 562 స‌ర్వే నంబ‌ర్‌లో 25 ఎక‌రాలే ఉండ‌గా, అధికారులు మాత్రం ధ‌ర‌ణిలో రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం ప‌ట్ట‌దారు పాసు పుస్త‌కాల‌ను జారీ చేస్తున్నార‌ని శ్రీనివాస్ రెడ్డి, శంభీరెడ్డి ఆరోపించారు.

కోర్టు నుంచి నోటీసులు

ధ‌ర‌ణి ద్వారా స‌మ‌కూరిన ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ను అడ్డం పెట్టుకొని భూస్వామి వార‌సురాలైన ఓ మ‌హిళ‌.. శ్రీనివాస్ రెడ్డి, శంభీరెడ్డి, ఇత‌ర రైతుల‌కు సివిల్ కోర్టు నుంచి ఇటీవ‌ల‌ నోటీసులు పంపారు. త‌మ వ‌ద్ద ధ‌ర‌ణి ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలున్నాయ‌ని, త‌మ‌ భూమి ఎక్క‌డుందో చూపించాల‌ని బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని స్థానిక రైతులు వాపోతున్నారు. అయితే కోర్టు వివాదంలో ఉన్న భూమిపై 57 ఏండ్ల కింద‌ట‌నే విక్ర‌యించిన భూస్వామి వార‌సురాలికి ధ‌ర‌ణిలో ఇప్పుడు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ను ఎలా జారీ చేశార‌ని బాధిత రైతులు అధికారుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

చాలా గ్రామాల్లో ఇదే ప‌రిస్థితి

రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ఇదే ప‌రిస్థితి ఉంద‌నే అభిప్రాయం రైతుల నుంచి వ్య‌క్తం అవుతున్నది. గ‌తంలో మావోయిస్టులు, క‌మ్యునిస్టులు భూ పోరాటాల ద్వారా దొర‌ల ఆధీనంలోని వేల ఎక‌రాల‌ను వాటిని సాగు చేసుకుంటున్న పేద రైతుల‌కు పంపిణీ చేశారు. మరికొందరు.. సాగులో ఉన్న రైతుల‌కు తెల్ల‌కాగితంపై విక్ర‌యించి ఎన్నో ఏండ్ల క్రితమే ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వెళ్లారు.

కాల‌క్ర‌మంలో సాగులో ఉన్న రైతుల‌కు అప్ప‌టి ప్ర‌భుత్వాలు 1-బీ ప్రోసీడింగ్‌ల‌ను, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌ను జారీ చేశారు. కానీ ప‌లుచోట్ల రెవెన్యూ రికార్డుల‌లో అధికారులు ప‌ట్టాదారు పేర్ల‌ను స‌వ‌రించ‌లేదు. అలాగే ల్యాంగ్ రికార్డ్స్ అప్‌డేష‌న్‌, ఫ్యూరిఫికేష‌న్ పేరుతో ప్ర‌భుత్వం పాత రికార్డుల‌ను ప్రామాణికంగా తీసుకుని 1-బీ ప్రొసీడింగ్‌ల‌ను జారీ చేయ‌డంతో పాటు 1-బీ ప్రొసీడింగ్ అందిన రైతుల‌కే ధ‌ర‌ణి ద్వారా నూత‌న ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌ను జారీ చేశారు.

అలాగే రాష్ట్రంలో నిజాం హ‌యాంలో మాత్ర‌మే భూ స‌ర్వే జ‌రిగింది. ఆ స‌మ‌యంలో కొన్ని స‌ర్వే నెంబ‌ర్ల‌లో ఉన్న భూ విస్తీర్ణంలో హెచ్చుత‌గ్గులు న‌మోదయ్యాయి. కానీ క్షేత్ర‌స్థాయిలో ఉన్న భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా కేవ‌లం పురాత‌న రెవెన్యూ రికార్డుల‌ను ప్రామాణికంగా తీసుకొని ప్ర‌భుత్వం ధ‌ర‌ణి ద్వారా ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌ను జారీ చేయ‌డం వ‌ల‌న ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని రెవెన్యూ, భూ చ‌ట్టాల నిపుణులు అభిప్రాయప‌ప‌డుతున్నారు.

ప్ర‌భుత్వం న్యాయం చేయాలి

57 యేండ్ల కింద‌ట భూములు విక్ర‌యించిన దొర‌ల వార‌సురాలైన నీలిమ‌కు మా భూమిపై ధ‌ర‌ణి ద్వారా ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌ను జారీ చేశారు. ఈ భూమి 57 యేండ్ల కింద‌ట మా తాత కొనుగోలు చేయ‌గా, మా తాత నుంచి మా తండ్రికి, మా తండ్రి నుంచి మాకు వార‌స‌త్వంగా స‌మ‌కూరింది.

ధరణి కారణంగా దీనిపై యాజ‌మాన్య హక్కులను కోల్పోయాము. మా స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం స్పందించి, మాకు న్యాయం చేయాల‌ని వేడుకుంటున్నాను. – శ్రీనివాస్ రెడ్డి, బాధిత రైతు

Latest News