Site icon vidhaatha

కేసీఆర్ ఇంటి దగ్గర క్షుద్ర పూజల కలకలం

ఆందోళనలో బీఆరెస్ శ్రేణులు

విధాత, హైదరాబాద్‌ : హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజల వస్తువులు పడివుండటం కలకలం రేపింది. క్షుద్ర పూజలు చేసినట్లుగా అక్కడ నిమ్మకాయలు, ఓ బొమ్మ, మిరపకాయలు, కవర్‌లో నల్లకోడి, దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు పడివున్నాయి. గత రాత్రి ఈ క్షుద్రపూజలు చేయగా, అక్కడ సంబంధిత వస్తువులను గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఈ క్షుద్రపూజలు ఎవరు చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. క్షుద్ర పూజల ఘటనతో బీఆరెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అసలే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్టీ నుంచి ముఖ్య నేతలంతా ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాల క్రమంలో కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజల ఘటన చోటుచేసుకోవడం బీఆరెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు వరుస నష్టాల నుంచి బయటపడేందుకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో తాజాగా వాస్తు మార్పులు చేయించారు. ఇంతలోనే కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు వెలుగుచూడటం బీఆరెస్ శ్రేణులను, కేసీఆర్ అభిమానులను కలవరపరిచింది.

Exit mobile version