Oommen Chandy | కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 సంవత్సరాల ఊమెన్ చాందీ.. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కేరళ అధ్యక్షుడు కేకే సుధాకరణ్ మంగళవారం తెలుపగా.. ఆయన కుమారుడు ధ్రువీకరించారు. చాందీ మరణంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. ఊమెన్ చాందీ పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి తిరువనంతపురం తరలించనున్నారు. అక్కడి నుంచి కొట్టాయానికి తరలించి.. అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, చాలాకాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదని, చికిత్స కోసం బెంగళూరులో ఉంటున్నారని కాంగ్రెస్ తెలిపింది. ఊమెన్ చాందీని అన్ని తరాలు, అన్ని తరగతుల వారు ప్రేమిస్తారని, తమ ప్రియతమ నేత అంతిమ వీడ్కోలు పలుకబోతుండడం బాధాకరమని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఊమెన్ చాందీ రాజకీయ ప్రయాణం
ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి నుంచి 1970లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. చాందీ పూతుపల్లి నియోజకవర్గం నుంచి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977లో కే కరుణాకరన్ కేబినెట్‌లో మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2004- 2006 వరకు, 2011- 2016 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే సమయంలో నాలుగుసార్లు ప్రతిపక్ష నేతగా కొనసాగారు.