హిమాల‌యాల‌క‌న్నా పురాతన గుట్టలు తెలంగాణలో ఎక్కడున్నాయో తెలుసా?

ఇప్పటి వరకూ భారత ఉపఖండంలో హిమాలయాలే అతి పురాతన పర్వతాలుగా భావించేవారు. అయితే.. తాజాగా దానికంటే పురాతనమైన గుట్టలు ఎక్కడ ఉన్నాయో తేలింది

  • Publish Date - March 13, 2024 / 04:45 PM IST

ఇప్పటి వరకూ భారత ఉపఖండంలో హిమాలయాలే అతి పురాతన పర్వతాలుగా భావించేవారు. అయితే.. తాజాగా దానికంటే పురాతనమైన గుట్టలు ఎక్కడ ఉన్నాయో తేలింది. ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణలో ఉన్న గొప్ప భౌగోళిక వార‌స‌త్వంపై అవ‌గాహ‌న పెంచేందుకు మార్చి, 12న‌ జియో హెరిటేజ్ వాక్‌ను జ‌య‌శంక‌ర్ భూపాల‌పల్లిలోని పాండ‌వుల గుట్ట వ‌ద్ద‌ నిర్వ‌హించింది. ఈ పాండ‌వుల గుట్ట హిమాల‌య ప‌ర్వ‌తాల‌క‌న్న పురాత‌న‌మైన‌ద‌ని జీఎస్ఐ వెల్ల‌డించింది. దానిని తెలంగాణలోని ఏకైక జియో-హెరిటేజ్‌ ప్రాంతంగా ప్రకటించింది.

ఈ గుట్ట తెలంగాణ‌కు, భూపాల‌ప‌ల్లికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చింద‌ని జీఎస్ఐ బృందం పేర్కొన్న‌ది. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ భువేశ్ మిశ్ర‌ మాట్లాడుతూ ఇలాంటి పురాత‌న‌మైన భౌగోళిక వార‌స‌త్వాన్ని కాపాడుకోవాల‌ని, రానున్న త‌రాల‌కు అందించాల్సిన బాధ్య‌త మ‌న మీద ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. ఖ‌నిజ వ‌న‌రులు, ప్ర‌కృతి స‌హ‌జ సంప‌ద‌లుగా మార‌డానికి కొన్ని వేల సంవ‌త్స‌రాలు ప‌ట్టింద‌ని, ఇలాంటి సంప‌ద‌ను కాపాడాల్సిన బాధ్య‌త స్థానికులపై ఉంద‌ని పేర్కొన్నారు. విద్యార్థులు జియో సైంటిస్ట్‌లు అవ్వ‌డానికి ఆస‌క్తి చూపించాల‌న్నారు. అలాంటి చ‌దువులు అభ్య‌సించి, దేశానికి ఉప‌యోగ ప‌డే విధంగా ఉండాల‌న్నారు. 174 సంవ‌త్స‌రాలుగా జీఎస్ఐ దేశానికి సేవ‌లందించ‌డం గ‌మాన‌ర్హం అన్నారు. భూపాల‌ప‌ల్లి డివిజ‌న‌ల్ అట‌విశాఖ అధికారి వ‌సంత మాట్లాడుతూ జీఎస్ఐ తెలంగాణ విభాగం ఈ స‌ద‌స్సును నిర్వ‌హించి పాండ‌వుల గుట్ట గురించి తెలియ‌జేసినందుకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

Latest News