MLA Bandla Krishnamohan Reddy: పార్టీ మార్పుపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పుకొచ్చారు. అంతేకానీ ఎప్పుడూ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నారు. ప్రజలకు మేలు జరిగేందుకు అభివృద్ధి పనులకు నిధుల సాధనకు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరుగుతుందన్నారు. అయితే నియోజవకర్గంలో కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాలలో నన్ను పాల్గొనకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం నేను సీఎం, మంత్రుల కార్యక్రమాలకు హాజరవుతుంటే నియోజవకర్గ నాయకులు అడ్డం పడుతున్నారన్నారు. ఇక్కడి ఎంపీ కూడా ఆ పార్టీ నాయకులకే వంతపాడుతున్నారన్నారు.
ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని..అధికారిక కార్యక్రమాల్లో నేను పాల్గొనకపోతే అదే ప్రజలు నన్ను విమర్శించే అవకాశముంటుందన్నారు. ఎమ్మెల్యే పదవి ఎవరికి శాశ్వతం కాదని..చేసిన పనులు మాత్రమే శాశ్వతంగా ఉంటాయన్నారు. ప్రజలకు కావాల్సిన పనులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో కలవడం జరిగిందన్నారు. కాని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీని నవ్వుల పాలు చేసేలా అధికారిక కార్యక్రమాల్లో రచ్చ చేస్తూ అడ్డుపడుతున్నారన్నారు. పార్టీ కార్యక్రమాలను, అధికారిక కార్యక్రమాలను వేరుగా చూడాలన్నారు.
