Patnam Mahender Reddy
విధాత: రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. గవర్నర్ సమయాన్ని బట్టి.. మంగళ, లేదా బుధవారాల్లో విస్తరణ ఉంటుందని సమాచారం.
ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి వైదొలిగిన తర్వాత ఒక స్థానం ఖాళీగానే ఉన్నది. ఇప్పటి వరకూ దానిని భర్తీ చేయకుండానే ఉంచారు. అయితే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో అవసరాల నిమిత్తం హడావుడిగా విస్తరణను పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ ఒక్కస్థానాన్నే భర్తీ చేస్తారా? లేక ఏమైనా మార్పులు కూడా ఉంటాయా? అన్న విషయంలో స్పష్టత లేదు. తాండూరు నుంచి తానే పోటీ చేస్తానని పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్.
మహేందర్‌రెడ్డిని తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు నిలుపుకోవచ్చని పార్టీ అధినేత అంచనా వేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.