Site icon vidhaatha

Pawan Kalyan: ఢిల్లీకి పవన్.. BJP పెద్దలతో భేటీ! ఏమిటా ఎజెండా!

విధాత‌: జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్‌తో కలిసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను ఆయన కలుస్తారని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో వెళ్లాలా టీడీపీతో నడవాలా అని మీమాంసలో ఉన్న పవన్‌కు ఈ ఢిల్లీ మీటింగ్‌లో కాస్త క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఈమధ్యనే ఢిల్లీలో ప్రధాని మోదీ, ఇతర పెద్దలను కలిసి జగన్ తిరిగొచ్చిన కొద్దిరోజులకే పవన్‌కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం గమనార్హం.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులతో సమావేశమవుతారని చెబుతున్నారు. వీలును బట్టి ప్రధాని మోడీని కూడా కలుస్తారని తెలుస్తోంది. తనకు బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ ఇవ్వలేదని.. కేంద్ర పెద్దలు అనుకూలంగానే ఉన్నా రాష్ట్ర నేతలు సహకరించడం లేదని ఇటీవల బందరులో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చిన పవన్.. తమ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు ఓట్లేయాలని పిలుపు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయన కూడా పవన్ వైఖరి మీద నిష్టూరమాడారు. ఇలాంటి పలు చిక్కు ముడులు ఉన్న తరుణంలో పవన్ ఢిల్లీ యాత్రకు రాజకీయ ప్రాధాన్యం ఉందని అంటున్నారు..

ఏపీ ఎన్నికల్లో.. బీజేపీతో కలిసి పోరాటమా.. టీడీపీతో వెళతారా లేదా ఒంటరి పోరాటమా అనేది ఈ పర్యటనలో తేలుతుంది అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా రానున్న ఎన్నిక‌ల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు పవన్ సిద్ధంగానే ఉన్నా బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేది లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల పొత్తుకు బీజేపీ పెద్దలను పవన్ ఒప్పించవచ్చని అంటున్నారు. ఇలాంటి సవాలక్ష సందేహాలకు ఈ ఢిల్లీ యాత్రలో సమాధానం దొరుకుతుందని అంటున్నారు.

Exit mobile version