Pawan Kalyan | సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు.జూలై 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ తరహాలో బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రతో చేయించారు. ఇది పెద్ద వివాదం అయింది.
అంబటి రాంబాబు కూడా ఈ వివాదంపై స్పందించారు. రోజు రోజుకి ఈ వివాదం చిలికి గాలి వానలా మారుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయాలని సినిమాలని కలిపి చూడవద్దు. రాజకీయంగా నడవడానికి సినిమాలే ఇంధనం. సమస్యలని డైవర్ట్ చేయడానికి నా సినిమాల గురించి తప్పుగా వైసీపీ నేతలు మాట్లాడతారు.
మీరు ఎదుటి వారి స్థాయికి దిగజారొద్దు. వివాదాల జోలికి వెళ్లకుండా వారు వేసిన ప్రశ్నలు ధీటుగా సమాధానం చెప్పాలి అని పవన్ అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్ సమస్యలని కప్పిపుచ్చుకోవడానికి ఇలా వైసీపీ నాయకులు డైవర్ట్ చేస్తారు.
ప్రజలకి సమస్యల గురించి తెలియజేయండి అని సొంత పార్టీ నేతలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నా చుట్టూ తిరిగిన వారు లీడర్స్ కారు, కలిసిన వారిని మళ్లీ మళ్లీ కలవడం వలన సమయం వృధా అవుతుంది. పార్టీ పెట్టడం, నడపడం అంత సులువు కాదని అన్న పవన్ కళ్యాణ్… విలువలతో రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితిని వైసీపీ కల్పించిందని చెప్పుకొచ్చారు.
ఎవరైన రాజకీయం చేయాలంటే దోపిడీ, దౌర్జన్యం, పిచ్చిగా కారుకూతలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అన్న రీతిలోవైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడి పదవి ఇప్పిస్తాం అని ఎవరైన డబ్బులు తీసుకుంటే.. అలాంటి వారిని పక్కన పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే దుష్టపాలకుడి మీద అని అన్న పవన్.. ఎందుకు ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు. బ్రో ఒక సినిమా మాత్రమే దాని గురించి మీరెవ్వరూ ఇక మాట్లాడొద్దని కూడా హెచ్చరించారు.