పేటీఎం సంచలన నిర్ణయం..! మాతృసంస్థ నుంచి వెయ్యిమంది ఉద్యోగులకు ఉద్వాసన..!

  • Publish Date - December 26, 2023 / 04:02 AM IST

Paytm Layoffs | ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం సంచలనం నిర్ణయం తీసుకున్నది. కంపెనీ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తున్నది. సేల్స్‌, ఇంజినీరింగ్‌తో పాటు పలు విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు పడినట్లు తెలుస్తున్నది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా ఉద్యోగులను తొలగించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.


కాగా.. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఎఫీషియెన్సీని పెంచి.. కోర్​ బిజినెస్​ని మెరుగుపరుచుకునే క్రమంలోనే ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ వైపు పేటీఎం అడుగులు వేస్తున్నది. ఏఐ కారణంగా కాస్ట్‌లో పదిశాతం మిగులుతుందని, కాస్ట్​ కటింగ్​తో పాటు ఊహించిన దాని కన్నా రెట్టింపు ఎఫీషియెన్స్​తో పని జరుగుతుందని స్పష్టం చేసింది.


‘మా కార్యకలాపాలకు ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ శక్తిని ఇస్తున్నాం. ఫలితంగా మాటిమాటికీ చేసే పనులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గుతాయి. అందుకే మా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది. మేం ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాల్ని ఏఐ ఇస్తున్నది. దాంతో మాకు 10 నుంచి 15 శాతం ఖర్చులు ఆదా అవుతున్నాయి. ఏడాది పొడవునా పర్ఫార్ఫెన్స్​ రివ్యూ చేస్తాం’ అని పేటీఎం ఒక ప్రకటనలో పేర్కొంది.


ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​పై ఫోకస్​ చేయాలని పేటీఎం ఉద్యోగులకు ఆ సంస్థ ఫౌండర్​, సీఈఓ విజయ్​ శేఖర్​ శర్మ సూచించినట్లు సమాచారం. టెక్నాలజీ, ప్రాడక్ట్​, ఇంజినీరింగ్​ బృందాలు మైక్రోసాఫ్ట్​ కార్ప్​, గూగుల్​ ఏఐ టూల్స్​ల పట్టు సాధించాలని చెప్పినట్లు తెలుస్తున్నది. ఆ టూల్స్​ని ఉపయోగించుకోవడంతో సాధారణంగా వారాలు పట్టే ప్రాడక్ట్​ డెవలప్​మెంట్​ అతితక్కువ సమయంలోనే పూర్తయ్యే అవకాశం ఉంటుంది.


అయితే, పేటీఎం 2021లో నాన్‌ ఫర్మార్మెన్స్‌ కింద 500 నుంచి 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా ఏఐ పేరుతో మరికొందరి ఉద్యోగులకు ఇంటికి పంపుతున్నది. మరో వైపు కంపెనీ కోర్‌ బిజినెస్‌ కోసం మానవ వనరులను పెంచాలని భావిస్తుంది. వచ్చే ఏడాదిలోగా దాదాపు 15వేల మందికిపైగా స్టాఫ్‌ను రిక్రూట్‌ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. సంస్థ చేపడుతున్న చర్యలతో భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందనున్నట్లుగా పేటీఎం భావిస్తున్నది.

Latest News