విధాత, హైదరాబాద్: రక్తాన్ని రంగరించ వద్దు.. లక్ష కోట్లతో ప్రాజెక్ట్‌లు కట్టి కుంగదీయ వద్దనే ప్రజలు మిమ్ముల్ని ఇంట్లో కూర్చోబెట్టారని ఇకనైనా బీఆరెస్ నేతలు అహంకారం వీడి ప్రజాతీర్పును గౌరవించాలని పీసీసీ అధికార ప్రతినిధి సామ రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కేటీఆర్ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం సమీక్షలో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ రక్తాన్ని రంగరించి చెమటను ధారపోశారని చేసిన వ్యాఖ్యలపై రాంమ్మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ చేసే అభివృద్ధిని చూడాటానికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలన్నారు. కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని పట్టించుకోలేదన్నారని, కేసీఆర్ ఆయన కోసం, ఆయన పార్టీ కోసం ప్రజలను పట్టించుకోని మాట నిజమేనని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అహంకారం వీడి ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉంటే మంచిందని అన్నారు. అలా కాకుండా ఇంకా అహంకారంతో మాట్లాడితే ప్రజలు రాజకీయాల్లోంచి తీసి ఇంటికి పంపిస్తారన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యతనిచ్చిందని, ఇప్పటికే రెండింటిని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామన్నారు. వాటన్నింటిని కంప్యూటరీకరించి, అర్హులను గుర్తించి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ఒక వైపు ప్రజలకు సంక్షేమాలు అందించే కార్యక్రమం చేపడుతూనే మరో వైపు ధరణి, కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేపడుతున్నామన్నారు.
ఇప్పటికే కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ విచారణ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలు కేసీఆర్ అవినీతి ఆధారాలన్ని వారి వద్ధ ఉన్నాయని చెప్పి ఏనాడు కూడా విచారణకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇవాళ సీబీఐ విచారణ చేయమని కోరడంలో ఆంతర్యం అర్థమవుతోందన్నారు. బీఆరెస్, బీజేపీ ఇద్దరు ఒక్కటేనన్నారు.
కాగా.. తాము బరాబర్ కాళేశ్వరం సహా విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల అవినీతిపైన, టీఎస్‌పీఎస్సీ అక్రమాలపైన, ధరణి అక్రమాలపైన విచారణ జరిపిస్తామని, అవినీతి కారకులైన దోషులు ఎంతటి వారైనా వదలిపెట్టమని రాంమ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ12 స్థానాలకు పైగా గెలుస్తుందన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు.