student died | ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. విద్యార్థి గొంతులో పెన్సిల్ పొట్టు ఇరుక్కుకొని ఆరేళ్ల విద్యార్థిని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. హమీర్‌పూర్ కొత్వాలి ప్రాంతంలోని పహాడీ వీర్ గ్రామానికి చెందిన నందకిషోర్‌కు కుమారుడు అభిషేక్ (12), కుమార్తెలు అన్షిక (8), అర్తిక (6) ఉన్నారు. బుధవారం సాయంత్రం టెర్రస్‌పై చదువుకుంటున్నారు. హోమ్‌వర్క్ చేయడానికి కూతురు అర్తిక పెన్సిల్ షార్ప్‌నర్‌ను నోట్లో పెట్టుకొని పెన్సిల్‌ను చెక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెన్సిల్‌ను చెక్కగా వచ్చిన పొట్టు గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది.
ఆ తర్వాత గొంతుకు అడ్డుగా పడడంతో బాధతో నేలపై పడిపోయింది. వెంటనే బంధువులు సీహెచ్‌సీకి తరలించగా.. వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సత్యేంద్రకుమార్ మాట్లాడుతూ పిల్లలపై ఎప్పుడు దృష్టి పెట్టాలని, దీంతో ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కొందరు పిల్లలు పడుకొని ఆహారం, నీళ్లు తాగుతారని, ఈ చర్యలు ప్రాణానికి ప్రమాదమన్నారు. ఆహారం శ్వాసనాళంలో చిక్కుకుపోతే మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పెన్సిల్‌ను సైతం జాగ్రత్తగా ఉపయోగించాలని, పిల్లల కంటికి సైతం హాని కలిగిస్తాయన్నారు. మంచంపై పడిఉన్న పెన్సిల్, పెన్ను అజాగ్రత్తగా పడేస్తే శరీరానికి గాయాలయ్యే అవకాశాలుంటాయన్నారు.