Site icon vidhaatha

PM Modi | శివాజీ ఎవరి భూభాగాన్నీ గుంజుకోలేదు: శరద్‌పవార్‌

PM Modi

పుణె: మరాఠా పాలకుడు శివాజీ మహరాజ్‌ ఎవరి భూమినీ గుంజుకోలేదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్సీపీలో, అంతకు ముందు శివసేనలో చీలికకు బీజేపీ కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో శరద్‌పవార్‌ వ్యాఖ్య వేదికపైనే ఉన్న ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించే చేశారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. మంగళవారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డును అందజేశారు.

ఈ కార్యక్రమంలో మోదీతో పాటు పవార్‌ వేదికను పంచుకున్నారు. ఎన్సీపీ నుంచి తన మేనల్లుడు అజిత్‌పవార్‌ చీలి పోయి, బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో చేరిన కొద్ది రోజుల అనంతరం మోదీ, పవార్‌ ఒక వేదికపైకి వచ్చారు. తొలుత పరస్పరం చిరునవ్వులతో, చిన్నపాటి మాటలతో ఇద్దరు నేతలు పలకరించుకున్నారు. మోదీకి అవార్డు ఇచ్చే కార్యక్రమానికి పవార్‌ హాజరవడంపై ప్రతిపక్ష పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఈ సందర్భాన్ని మోదీపై చురకలు వేసేందుకు శరద్‌పవార్‌ ఉపయోగించుకోవడం విశేషం.

లోక్‌మాన్య తిలక్‌ దేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరుకున్నారు. ఆయన తన తొలి రోజులను పుణెలోనే గడిపారు. బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రజలందరినీ ఐక్యం చేయాలని భావించారు. ఆయన జర్నలిస్టగా మారారు. కేసరి, మరాఠా వారపత్రికలను నడిపించారు. జర్నలిజంపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని, జర్నలిస్టులను ఒత్తిడి చేయకూడదని తరచూ చెబుతుండేవారు’ అని పవార్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ప్రధాని.. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మందికి అంకితం చేస్తున్నానని చెప్పారు. అవార్డు కింద ఇచ్చిన లక్ష నగదును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ప్రకటించారు. స్వాతంత్ర్య సమరయోధుడైన తిలక్‌ పేరిట ఇచ్చిన పురస్కారం.. తన బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ బాయిస్‌, ముఖ్యమంత్రి ఎక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌పవార్‌, కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version