Priyanka Vadra | అమేథీ బరిలో ప్రియాంక వాద్రా?

  • Publish Date - April 12, 2024 / 10:22 AM IST

దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా యూపీలోని రాయబరేలి, అమేథీ నియోజవర్గాల పైనే అందరి దృష్టి ఉన్నది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తరఫున ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ నియోజకవర్గాలకు దశాబ్దాలుగా గాంధీ కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉన్నది. అందుకే ఈ స్థానాల్లో వాళ్లే ఉంటారా? ఇతరులను పోటీకి నిలుపుతారనే చర్చ జరుగుతున్నది. ఈ సమయంలోనే ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావలనుకుంటున్నట్టు, అమేథీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నటు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అమేథీ, రాయబరేలి’ స్థానాలపై నిర్ణయం వచ్చే వరకు ఎదురుచూడండి. ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబసభ్యులు పోటీ చేస్తారు.’ అని స్పష్టంగా చెప్పారు. అలాగే రాబర్ట్‌ వాద్రా పోటీ చేస్తారనే ఊహాగానాలపై స్పందిస్తూ ‘ అలా జరగకపోవచ్చు’ అన్నారు.

స్మృతి ఇరానీతో ప్రియాంక ఢీ?

సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయబరేలీ స్థానం కూడా ఖాళీగా ఉన్నది. దీనితో పాటు అమేథీలో రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లో బీజేపీ సీనియర్‌ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈసారి మరోసారి డీ కొంటారా? లేక ప్రియాంకను బరిలో దింపుతారా? త్వరలో తేలనున్నది. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్‌లో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ పూర్తి కానున్నది. ఆ తర్వాతే అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సస్పెన్స్‌ వీడనున్నది. ఏకే ఆంటోని చెప్పిన దాని ప్రకారం ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయనున్నారన్నది తేలిపోయింది. యూపీలో ప్రియాంక గాంధీ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి అమేథీలో ప్రియాంక పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

రాయబరేలీ బరిలో రాహులా? వరుణా?

రాయబరేలీ నుంచి రాహుల్‌ పోటీ చేస్తారా? లేక సొంతపార్టీపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన వరుణ్‌గాంధీ బరిలో ఉండే అవకాశం ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది. ఫిలీభీత్‌ నియోజకవర్గం నుంచి కూడా గాంధీ కుటుంబానికి ముప్పై ఏళ్ల కు పైగా అనుబంధం ఉన్నది. తాజా ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్‌ నిరాకరించింది. అక్కడ ఆయనకు బదులుగా యూపీ రాష్ట్ర మంత్రి జతిన్‌ ప్రసాద్‌ను బీజేపీ నిలబెట్టింది. దీంతో వరుణ్‌ గాంధీ తన భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి నెలకొన్నది. ఆయన ఫిలీభీత్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ అక్కడ పోటీలో లేరు. అలాగే ఆస్థానంలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ఆయనకు టికెట్‌ కేటాయించకపోవడంపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధీర్‌ రంజన్‌ తనను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

వరుణ్‌ గాంధీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది కాంగ్రెస్‌ అగ్రనేతను రాహల్‌ గాంధీని ఆయన కేదార్‌ నాథ్‌లో కలుసుకోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీకి దూరంగా ఉంటున్న ఆయన పార్టీ మారే అవకాశం ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన టికెట్‌ రాకపోవడం, కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటలు రాయబరేలీ, అమేథీల్లో ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబమే పోటీ చేస్తుందని, నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలనడంతో వరుణ్‌గాంధీ పేరు వినిపిస్తున్నది. ఏప్రిల్‌ 26న వయనాడ్‌లో పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్తత వచ్చేఅవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

Latest News