Telangana | తెలంగాణ ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
రాగల మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.