Site icon vidhaatha

Revanth Reddy | ఒకే ఒక్కడు.. కొడంగల్ కాంగ్రెస్ టికెట్ రేస్‌లో రేవంత్ రెడ్డి ఒక్కరే

Revanth Reddy |

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ టికెట్ పొందాలంటే ముందస్తు గా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. తెలంగాణలో 119 స్థానాలకు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించే నేతలు దరఖాస్తు చేసుకున్నారు. చాలాచోట్ల ఒక్కో స్థానానికి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి చేరాయి.

కానీ కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం ఒకే ఒక దరఖాస్తు వచ్చింది. ఆ ఒక్కరే టీపీపీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి అసమ్మతి బెడద లేదని ఆ పార్టీలో చరిత్ర సృష్టించారు. అసమ్మతి అంటేనే కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు.

అలాంటి పార్టీకి మధ్యలో వచ్చి చేరిన రేవంత్ రెడ్డి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని కలబడి, నిలబడి నిలదొక్కుకుని ఫైర్ బ్రాండ్ గా పేరుపొందారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అంటే రాజకీయాల్లో సంచలనం.ఆయన మాటే ఓ తూటా.. ఆయన ప్రసంగం లక్షల మెదళ్ళను ఆలోచింపచేసే మాటల మాంత్రికుడు.

రాష్ట్ర కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆ పార్టీలో అంతటి ధీరశాలి రేవంత్ రెడ్డి అని పార్టీ శ్రేణులే అంటున్నారు. అలాంటి రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక వ్యక్తి గా సీనియర్ నాయకుల అండతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధులవుతున్నారు.

రాజకీయ ప్రస్థానం ఇదీ..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానికసంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రావులపల్లి గుర్నాథరెడ్డిపై ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ని ఖంగుతినిపించారు.

2014లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం పొంది, అసెంబ్లీలో టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నారు. రాను రాను తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడుతున్న టీడీపీని వీడాలని అనుకున్నారు. 2017 అక్టోబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఆపార్టీలో ఉన్న ఉద్ధండ నేతల మధ్య నెట్టుకురావడం కష్టం అనుకున్న ఆయన పార్టీ కేంద్ర అధినాయకత్వానికి దగ్గరయ్యారు. రేవంత్ రెడ్డిపై పూర్తి భరోసా ఉన్న కేంద్ర కాంగ్రెస్, రాష్ట్రంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఏకంగా 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఇలాంటి డైనమిక్ కాంగ్రెస్ పార్టీ కి అవసరమని భావించిన కాంగ్రెస్, 2021లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.

రేవంత్ రెడ్డి నియామకాన్ని కొందరు సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి సీనియర్ నాయకుల నుంచి ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీని ముందుకు నడిపించడంలో నిమగ్నమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version