విధాత: సముద్ర గర్భాలు అంతులేని విచిత్రాలకు నిలయాలన్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వాటిని కనుగొంటున్నారు. తాజాగా భూమి మీదే గురుత్వాకర్షణ (Gravitational Force) అత్యంత బలహీనంగా ఉన్న హిందూ సముద్రం (Indian Ocean)లోని భారీ బిలం ఎలా ఏర్పడిందో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
బిలం అంటే మనం ఊహించుకునే భారీ రంధ్రం కాదని.. అయితే ఆ ప్రాంతం కింద పదార్థం బాగా గుల్లగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంపై పరిశోధన చేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు దేవాంజన్ పాల్, ఆత్రేయీ ఘోష్‌లకు ఇటీవలే దీని వెనకు ఉన్న రహస్యం తెలిసింది.
టెక్టానిక్ ప్లేట్‌ల కదలికల వల్ల మునిగిపోయిన పురాతన సముద్రమే ఈ ప్రాంతం ఇలా మారడానికి కారణం అని వారు భావిస్తున్నారు. హిందూ మహా సముద్రం (Indian Ocean)లో ఈ భారీ బిలం భారత దక్షిణ కొనకు నైరుతి దిశగా 1200 కి.మీ. దూరంలో 30 లక్షల కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ పరిశోధన చేయడానికి శాస్త్రవేత్తలు 14 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులను కంప్యూటర్‌లో సృష్టించారు. అప్పట్లో ఇక్కడ ఉన్న భారీ సముద్రాన్ని ఆఫ్రికా నుంచి వచ్చిన భారీ టెక్టానిక్ ప్లేట్ ముంచేసిందని గుర్తించారు.
దాని వల్లే ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం చాలా తేలికగా… ఏ మాత్రం బరువు లేకుండా ఉందని తెలుసుకున్నారు. అంతే కాకుండా భూమి ఆకారం కూడా ఈ గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ బలహీనంగా ఉండటానికి కారణంగా కనిపిస్తోంది.
#WIONPulse | Scientists find why there is giant ‘hole’ in the Indian Ocean, where Earth’s gravity is at weakest.@AnanyaDutta97 tells you more
For more videos, visit: https://t.co/AXC5qRugeb#IndianOcean pic.twitter.com/1uPYMEzrhN
— WION (@WIONews) June 30, 2023
మనం అందరికీ చిత్రాల్లో కనిపించినట్టు భూమి గుండ్రంగా ఉండదు. ఒక వేళ అలా ఉంటే గురుత్వాకర్షణ శక్తి అన్నిచోట్లా ఒకేలా ఉండేది. కానీ భూమి ధ్రువాల దగ్గర సమంగా.. భూమధ్య రేఖ వద్ద బయటకు పొడుచుకొచ్చిన బుడిపెలా ఉంటుంది. పైగా వివిధ ప్రాంతాల్లో అసమానంగా విస్తరించిన భూ పొరలు గ్రావిటేషనల్ శక్తిని ప్రభావితం చేస్తాయి.
ఈ భారీ బిలం లాంటి ప్రదేశంలో తక్కువ గురుత్వాకర్షణ శక్తి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ పరస్పర విరుద్ధ శక్తుల ప్రభావంతో ఇక్కడి సముద్ర మట్టం ప్రపంచ సముద్రమట్టాల సగటు కంటే ఏకంగా 106 మీటర్ల దిగువకు ఉంటుంది.
ఈ ప్రదేశాన్ని ఎప్పుడు కనుగొన్నారు?
తొలుత ఈ ప్రదేశాన్ని డచ్ జియోఫిజిసిస్ట్ ఫెలిక్స్ ఆండ్రీస్ 1948లో కనుగొన్నారు. భారీ ఓడలు,శాటిలైట్ చిత్రాల ద్వారా ఆ ప్రదేశాన్ని పరిశోధించినప్పటికీ అది ఎందుకు ఏర్పడిందో ఇప్పటి వరకు కారణాలు కనుగొనలేకపోయారు.
అఖండ గోండ్వానా ఖండం రెండుగా విడిపోయినపుడే ఈ ప్రాంతం జనించి ఉంటుందనీ కొంత మంది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒకప్పుడు గోండ్వానా ఖండంలో ఆఫ్రికాతో కలిసి ఉన్న భారత ఉపఖండం.. విడిపోయి క్రమంగా రష్యా ప్లేట్ వైపు చొచ్చుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ ప్రక్రియ సాగుతోంది.