- ఏప్రిల్ 30న జరగాల్సిన ఎన్నిక.. రద్దు చేస్తూ గెజిట్
విధాత : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board elections) ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఏప్రిల్ 30న దేశంలోని మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ (Ministry of Defence) సిద్ధమైంది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణశాఖ ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం తాజాగా గెజిట్ జారీ చేసింది.
వాస్తవానికి 2020తో సికింద్రాబాద్ కంటెన్మెంట్ బోర్డు పదవీకాలం ముగిసి పోయింది. అయితే.. దానిని మూడేండ్లు పొడిగించారు. అదికూడా ముగిసిపోతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావించింది. అయితే.. కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు కోర్టుకెక్కాయి.
దీనితోపాటు కంటోన్మెంట్ ఓటర్ల జాబితాలో 35వేల ఓట్లు తొలగించడాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ మున్సిపల్, పట్ణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు (KT Ramarao) లేఖ రాశారు. ఓటర్ల జాబితాలో లొసుగులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. వారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చి వారి ఓటు హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
రక్షణభూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో దాదాపు 35 వేల మంది పేర్లను కంటోన్మెంట్ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. పేర్లు తొలగించే ముందు వారికి కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. వీరంతా కంటోన్మెంట్‌ప్రాంతంలో దాదాపు 75 ఏళ్లుగా నివసిస్తున్నవారేనని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు ఓటు హక్కు తొలగించడం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారి గుర్తింపునకు సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.