Selfie Challenge
విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఎవరి శక్తి మేరకు వారు తమ సత్తా చాటేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎవరి హయాంలో ఏమి చేసాం అన్నది చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే అవతలివారికి సవాళ్లు విసురుతున్నారు. ఈ మేరకు ఎవరికీ వాళ్ళు తాము చేపట్టిన, పూర్తి చేసిన ప్రాజక్టుల వద్ద నిలబడి సెల్ఫీలు తీసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నడిపిస్తున్నారు.
తాము చేపట్టిన, లేదా సగం పూర్తి చేసిన పథకాలు, పరిశ్రమలు, రోడ్లు, వంటివి జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేయడమో.. ఇంకా అలాగే వదిలేయడమే జరిగింది అంటూ చంద్రబాబు, లోకేష్ వంటి వారు ఆరోపిస్తూ ఆయా నిర్మాణాల వద్ద సెల్ఫీ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ట్రేండింగ్ చేస్తున్నారు. ఆ మధ్య లోకేష్ మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్(Selfie Challenge) ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నడుస్తోంది.
నెల్లూరులో టైడ్కో ఇల్లు మేము పూర్తి చేసినా వాటిని జగన్ కనీసం పంపిణీ చేయలేక పోయారని ఆరోపిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేయగా అదంతా అవాస్తవం అని, చంద్రబాబు పది పైసల వంతు చేసి వదిలేస్తే తామే మిగతా పనులు చేశామని వైసిపి వాళ్ళు చెబుతూ ఫోటోలు దిగుతున్నారు.
ఇక విజయనగరంలో అశోక్ గజపతి రాజు వంటి సీనియర్ నాయకులు సైతం తాము చేపట్టిన రోడ్లు, వంతెనల వద్ద ఫోటోలు దిగుతుండగా.. దానికి పోటీగా డిప్యూటీ స్పీకర్ అనుచరులు సైతం అసలు విజయనగరానికి కళ తెచ్చిందే తామని.. తాము చేపట్టిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి తప్ప మీరేం చేయలేదని ప్రశ్నిస్తూ సీసీ రోడ్లు, నగర సుందరీకరణ ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగారు.
ఇక శ్రీకాకుళంలో మంత్రి సీదరి అప్పలరాజు సైతం ఉద్దానంలో జగన్ ఆధ్వర్యంలో చేపట్టిన క్యాన్సర్ ఆస్పత్రి పనులు, స్వచ్ఛమైన నీటి సరఫరా వ్యవస్థల వద్ద ఫోటోలు దిగి టీడీపీ నాయకులకు ఛాలెంజ్ లు విసిరారు.. మొత్తానికి రెండు పార్టీలు ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు… ఏదైతేనేం ప్రజలకు మాత్రం ఎవరేమిటన్నది వాస్తవాలు తెలుస్తున్నాయి… అని అంటున్నారు.