Site icon vidhaatha

TSLPRB | ఎస్ఐ ఫ‌లితాల వెల్ల‌డికి వేళాయే.. జులై రెండో వారంలోనే విడుద‌ల‌..!

TSLPRB |

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీ తుది అంకానికి చేరుకుంది. ఇక ఫైన‌ల్ రిజ‌ల్ట్స్ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఆ ఫ‌లితాల విడుద‌ల‌కు కూడా స‌మ‌యం ఆసన్న‌మైంది. జులై రెండో వారంలో మొద‌ట‌గా ఎస్ఐ ఫ‌లితాలు విడుద‌ల చేసి, ఆ త‌ర్వాత కానిస్టేబుల్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇక తుది రాత‌ప‌రీక్ష‌లో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్య‌ర్థులు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌న‌కు హాజ‌ర‌య్యారు. వీరిలో నుంచే క‌టాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను త‌యారు చేయ‌నున్నారు.

ఎస్ఐల ఎంపిక‌కు మ‌ల్టీ జోన్ల‌లోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపిక‌కు జిల్లాల్లోని ఖాళీల‌కు అనుగుణంగా క‌టాఫ్ మార్కుల్ని నిర్ణ‌యించ‌నున్నారు. సామాజిక వ‌ర్గాల వారీగా, మ‌హిళ‌లు, పురుషులు, ప్ర‌త్యేక కేట‌గిరీలు, రోస్ట‌ర్ పాయింట్లు.. ఇలా దాదాపు 180కి పైగా అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని క‌టాఫ్ మార్కుల్ని నిర్ణ‌యించాల్సి ఉన్నందున కూలంక‌షంగా ప‌రిశీలిస్తున్నారు. ఇదంతా స‌వ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలోనే తుది జాబితా వెలువ‌డే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం తుది రాత‌ప‌రీక్ష‌లో ఎంపికైన వారిలో ప‌లువురు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌కు పోటీ ప‌డుతున్నారు. మొద‌ట ఎస్ఐ విజేత‌ల్ని ప్ర‌క‌టిస్తే బ్యాక్‌లాగ్‌ల‌ను నివారించొచ్చ‌నేది టీఎస్ ఎల్‌పీఆర్‌బీ ఆలోచ‌న‌. ఎస్ఐగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టును వ‌దులుకుంటామ‌ని అండ‌ర్ టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మ‌రొక‌రు ఎంపిక‌య్యే అవ‌కాశం ఉంటుందని మండ‌లి భావిస్తోంది.

Exit mobile version