విధాత, హైదరాబాద్ : ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి వినియోగం కలకలం రేపింది. హైదరాబాద్ – చేవెళ్ల ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ బర్త్ డే పార్టీ జరిగింది. పార్టీలో పలువురికి మందు సరఫరా చేశారు. పార్టీ సందర్భంగా పోలీసులు ఈ రిసార్ట్‌పై దాడులు నిర్వహించగా..భారీగా విదేశీ మద్యం, గంజాయి పట్టుబడింది. అలాగే పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా..పరీక్షల్లో ఈవెంట్ మేనేజర్ దామోదర్ రెడ్డి గంజాయి సేవించినట్లుగా తేలింది. బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ లు కూడా పాల్గొన్నారు. చేవెళ్ల పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్టీకి హాజరైన వారందరికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించిన మంగ్లీపై కేసు నమోదు చేశారు.
విదేశీ మద్యంతో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని త్రిపురా రిసార్ట్ జీఎం శివరామకృష్ణపైన, రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజు, దామోదర్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారిస్తున్నారు. దామోదర్ రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజే సీజ్ చేశారు. చట్టాలు పాటించకుండా ఎలాపడితే అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు చట్టం కొరడా జుళిపించి గాడినపెట్టాల్సి వస్తుందని.. ఎంతటిప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారిపట్ల కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడమని ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది.