విధాత: సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.దీని కోసం జగిత్యాల మండలం తాటిపల్లికి సిట్ బృందం వెళ్లనున్నది. రాజశేఖర్ తన బంధువులకు ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఎవరెవరికి ప్రశ్నపత్రాలు విక్రయించాడు అనే కోణంలో సిట్ దర్యాప్తు చేయనున్నది. మరో నిందితురాలు రేణుక స్వగ్రామంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
మరోవైపు ఈ లీకేజీ కేసులో కస్టడీలోని నిందితుల నుంచి సిట్ బృందం కీలక సమాచారం సేకరించింది. కమిషన్ కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా రాజశేఖర్‌రెడ్డి గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్లు కొట్టివేయడానికి చాలా పకడ్బందీగా పథకం వేసినట్టు సిట్ గుర్తించింది.
నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే ఆయన ప్రశ్నపత్రాలపై కన్నేశాడని తేలింది. నెట్‌వర్క్ అడ్మిన్‌గా తనకు ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడని తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్లు దొంగిలించే క్రమంలో ఆయన నాలుగుసార్లు విఫలమైనట్టు తేలింది.
విపక్షాల నిరసనలు
మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీపై విపక్షాలు ఆందోళనలను ఉధృతంగా కొనసాగుతున్నాయి. మా నౌకర్లు మాక్కావాలి అని బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ను పదవీ నుంచి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న పలు చోట్ల నిరసనలు తెలిపింది.
ఓయూలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనార్దన్‌రెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన పరీక్షలన్నింటినీ రద్దు చేయాలని, ఆయనను ఛైర్మన్ పదవీ నుంచి తొలిగించాలని, సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏబీవీపీ కార్యకర్తల ప్రగతిభవన్ ముట్టడి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు.
ప్రవీణ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు తలుపు తడతామన్నారు. నిన్న హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగుల భరోసా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. TSPSC నిర్వహణ లోపాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నేడు హైకోర్టులో విచారణ
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ..ఎన్‌ఎస్‌యూఐ, మరో ఇద్దరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర పై విచారణ జరపాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్ వాదించనున్నారు. ఈ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.