గాజా మీద ఇజ్రాయెల్ దాడులపై
సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్
న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణను నిలిపివేయాలని యావత్ ప్రపంచం కోరుకుంటున్నదని ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్ అన్నారు. కాల్పుల విరమణ పాటించి.. రాజకీయ పరిష్కారానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. గాజాలో ఈ రోజు ఇజ్రాయెల్ పాల్పడుతున్న ఊచకోతను చూస్తూ ఊరుకుంటే.. అక్కడ జరుగుతున్న సామూహిక హత్యాకాండలు రేపటి రోజున మనల్నీ చుట్టుముట్టి, మన ప్రాణాలకు కూడా ముప్పు తేవచ్చని హెచ్చరించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ మారణ హోమాన్ని అడ్డుకొనటానికి మన వైపు నుండి కృషి చేయకపోతే ఆ నేరంలో, ఆ దారుణాలలో మనం కూడా భాగం అవుతామని ఆమె పేర్కొన్నారు. మన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. లేదంటే రాబోయే తరాలు మనల్ని క్షమించబోవని స్పష్టం చేశారు. గాజాలో హాస్పిటల్స్ పై, జనావాసాలపై, ప్రజా కాలనీలపై, మసీదులపై వందల బాంబులు కుమ్మరిస్తుంటే మనం చూస్తూ ఊరుకొనడమేనా? లక్షలాది ప్రజలను బలవంతంగా వారి గ్రామాల నుండి ఖాళీ చేయిస్తుంటే మనం కిమ్మనకుండా చూస్తూ ఊరుకొనటమేనా? కూలిన బిల్డింగులు, హాస్పిటళ్ల శిథిలాల నుంచి వేల శవాలను బయటకు తీస్తూ ఉంటే మన మానవత్వం మంట కలిసి పోవడం లేదా? ఇజ్రాయిల్ తన ఇష్టానుసారం మానవ నిర్మూలనకు పూనుకొంటుంటే మొత్తం ప్రపంచం చూస్తూ ఊరుకుండటమేనా? అక్కడ మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా స్వైర విహారం చేస్తున్నవారిని చూస్తూ ఉండటమేనా? అని ప్రశ్నించారు. ‘రెండు వైపుల హింస వల్ల వేలాది మంది పీడితులు సాక్ష్యంగా మిగిలారు. నేరాలకు పాల్పడుతున్న వాళ్లు మాత్రం సజీవంగానే ఉన్నారు వాళ్ళు చేస్తున్నది ఏమిటి? నిజంగా వాళ్ళు చేస్తున్నదంతా వారి భవిష్యత్ తరాలకేనా?’ అని ప్రశ్నించారు.
సుదీర్ఘకాలంగా రగులుతున్న పాలస్తీనా సమస్యకు మిలిటరీ దాడులు పరిష్కారాలను చూపించలేవని ఆమె స్పష్టం చేశారు. ఘోరమైన రాక్షసత్వ దాడులు ఎటువంటి ఫలితాలు సాధించవని అన్నారు. రాజకీయ పరిష్కారం మాత్రమే ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తుందని స్పష్టం చేశారు. రెండు వైపులా శాంతి కోసం తప్పక ప్రయత్నం చేయాలని, అందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని ఆమె సూచించారు. ఈ రాక్షసత్వానికి ముగింపు పలకాలని, పాలస్తీనియన్లకు తప్పక ఒక స్వదేశమంటూ ఉండాలని చెప్పారు.