Site icon vidhaatha

బెంగళూరులో నీటకి కటకట.. ఆ పనులకూ నీళ్లు వాడొద్దని ఆదేశాలు


బెంగళూరు: తాగునీటి ఎద్దడితో బెంగళూరు విలవిల్లాడిపోతున్నది. దీంతో బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఉల్లంఘించినట్టయితే జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించింది. ఈ జరిమానాలు 5వేల నుంచి ఉంటాయి. తాగునీటికి సైతం సరఫరాలు లేని నేపథ్యంలో ప్రజలు తమ కార్లను కడిగేందుకు తాగునీటిని వాడరాదని పేర్కొన్నది.


దానితోపాటు.. గార్డెనింగ్‌, నిర్మాణపనులు, వాటర్‌ ఫౌంటెయిన్లకు కూడా తాగునీటిని వినియోగించరాదని 08-03-2024న జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘించినవారికి 5వేల రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొన్నది. అదే ఉల్లంఘన మరుసటి రోజు చేస్తే ఐదువేలకు మరో ఐదు వందలు జోడిస్తామని హెచ్చరించింది.


నీటి సమస్యపై 1916 నంబర్‌తో ఒక కాల్‌సెంటర్‌ను బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఏర్పాటు చేసింది. ఉల్లంఘనలు జరుగుతున్నట్టు తెలిస్తే ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది. మాల్స్‌, సినిమా హాల్స్‌లో కూడా తాగునీరు, రోడ్లను శుభ్రపర్చడం, ఇతర పారిశుధ్య అవసరాలకు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నది.


బెంగళూరు నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. గత వారం రోజులుగా నీటి ఎద్దడిని పరిష్కరించడానికి బెంగళూరు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.


నీటి ఎద్దడిని ప్రైవేట్‌ ట్యాంకర్లు భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కర్ణాటక ప్రభుత్వం నీటి ట్యాంకర్‌ ధరపై ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆరు వేల లీటర్ల వాటర్‌ ట్యాంకర్‌కు 450 రూపాయల నుంచి 600 రూపాయల వరకు చార్జ్‌ చేసేవారు. అయితే.. నీటి ఎద్దడితో వాటి ధరలు ఏకంగా 2000, 3000 రూపాయలకు పెంచేశారు. దీన్ని నివారించేందుకు ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


బెంగళూరులో రోజూ వచ్చిపోయేవారు సహా కోటీ 40 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నట్టు బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ లెక్కలు పేర్కొంటున్నాయి. వేసవి తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, నీటిని సరఫరా చేసే చెరువులు, నదులు ఎండిపోవడంతో తీవ్ర సమస్య నెలకొన్నది. దీంతో నీటి వృథాను అరికట్టే క్రమంలో భాగంగా తాజా సర్క్యులర్‌ జారీ చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి.


అయితే.. కావేరీ నీటిని సరఫరా చేసే ప్రాంతాల్లో సమస్య లేదని బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చైర్మన్‌ రామ్‌ ప్రసాద్‌ మనోహర్‌ చెప్పారు. కావేరీ నీటి సరఫరా లేని ప్రాంతాల్లోనే ఇబ్బంది ఉన్నదని తెలిపారు. బెంగళూరు నగరానికి రోజూ 1450 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉన్నది. ప్రస్తుతానికి డిమాండ్‌ను అధిగమించేందుకు 1470 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

Exit mobile version