Site icon vidhaatha

MLC Kavitha: సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం దండు కట్టాలి: ఎమ్మెల్సీ కవిత

42శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి
రేవంత్ రెడ్డి అంత బలహీనమైన సీఎం ఉమ్మడి రాష్ట్రంలోనూ లేరు
8వేల కోట్ల ఫీజు బకాయిల విడుదలకు పోరాటాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థులు ఇక సామాజిక తెలంగాణ సాధనకు నడుం కట్టి కదలాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ జాగృతిలో చేరిన విద్యార్థి నాయకులకు కవిత కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లను ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్దరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని..సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా విడుదల చేసిన ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరని కవిత ఎద్దేవా చేశారు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారని..దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలన్నారు. ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని.. జాబ్ కాంగ్రెస్ లో చేస్తున్నానని సీఎం అన్నారని..చేస్తున్న జాబ్ లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదని కవిత విమర్శించారు.

ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారని..తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్నారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఎద్దేవా చేశారు. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని..ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేకుండేనన్నారు.
విద్యార్థల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని..దాదాపు 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంటు బకాయిలు ఉన్నాయని కవిత తెలిపారు. తక్షణమే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోందన్నారు. విద్యార్థుల సమస్యల సాధనకు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని సూచించారు.

Exit mobile version