Site icon vidhaatha

High Court | టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

High Court

హైద‌రాబాద్‌, విధాత : కోర్టుకు అందజేసిన అఫిడవిట్‌లో, కౌంటర్‌లో వేర్వేరుగా గణాంకాలు పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌–1 పాల్గొన వారి సంఖ్యలో తేడాలు ఉన్నాయని, కౌంటర్‌లో సంఖ్యతో పోలిస్తే అఫిడవిట్‌లో 250 మంది పెరిగారని.. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

జూన్‌ 11న తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని కోరుతూ గ్రూప్‌–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్‌ వేశారు.

టీఎస్‌పీఎస్సీని ప్రతివాదిగా పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 13న టీఎస్‌పీఎస్సీకి వినతి పత్రం కూడా ఇచ్చామని చెప్పారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మాధవీ దేవి ధ‌ర్మాస‌నం గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపిస్తూ బయోమెట్రిక్‌ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు తావిచ్చినట్లు అయ్యిందన్నారు.

హాల్‌టికెట్‌ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని.. అప్లికేష‌న్ చేసిన‌ప్పుడు పేరు ముందు ఒక ఇంన్ష‌ల్, ఎగ్జామ్ రాసెట‌ప్పుడు ఓఎంఆర్ షీట్‌పైన పేరు ముందు మ‌రో ఇంన్ష‌ల్ ఉన్నా అధికారులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఎగ్జామ్ రాసేందుకు అవ‌కాశం ఇచ్చార‌ని తెలిపారు.

ఇది అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చేలా ఉందని పేర్కొన్నారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న అత్యంత కీలక పోస్టులు భర్తీ చేసే గ్రూప్‌–1 విషయంలోనూ పకడ్బంధీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించదన్నారు.

బయోమెట్రిక్‌ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు..

టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ‘గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహణకు కమిషన్‌ అన్ని పకడ్భందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరుగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్‌ తీసుకోలేదన్న ఆరోపణ సరికాద‌ని ఆయ‌న తెలిపారు.

ఆధార్, పాన్, ఎన్నికల కార్డు లాంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో హాల్‌ టికెట్లను సరిపోల్చి చూశారు. ఆ తర్వాతే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ప్రిలిమ్స్‌ను కమిషన్‌ సమర్థవంతంగా నిర్వహించింది.

ఓ అమ్మాయి సంతకంపై పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లికాక ముందు ఇంటిపేరుకు, పెళ్లి అయిన తర్వాత ఇంటి పేరు మారడంతో పేరుకు ముందు ఇంన్ష‌ల్‌లో వేరుగా ఉండ‌టంతో సంతకంలో తేడా వచ్చింద‌న్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు తప్పా ఎవరూ ప్రిలిమ్స్‌ రద్దు కోరలేదు.

వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదు. టీఎస్‌పీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు, మెయిన్‌ నిర్వహణకు అనుమతి ఇవ్వాలి. పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇరువురి వాద‌నాలు విన్న జ‌స్టిస్ మాధ‌వీదేవి ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వు చేశారు.

Exit mobile version