Site icon vidhaatha

High Court | సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోండి: TGPSCకి హైకోర్టు స్పష్టీకరణ

విధాత: గ్రూప్-1 నియామకాల వివాదంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్-1 నియామకాల విషయంలో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ ను సీజే ధర్మాసనం డిస్పోజ్ చేసింది. బుధవారం వాదనల సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోరారు. దీనికి సీజే ధర్మాననం నిరాకరించింది. ఈరోజు మధ్యాహ్నం సింగిల్‌ బెంచ్‌లో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోలేమంది.

సింగిల్‌ బెంచ్‌లోనే ఈ పిటిషన్లపై తేల్చుకోవాలని స్పష్టం చేసింది. గ్రూప్‌ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.

దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ పిటిషన్‌ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ అప్పిల్ పిటిషన్ ను తిరస్కరించిన సీజే ధర్మాసనం వివాదాన్ని సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

Exit mobile version