Site icon vidhaatha

High Court: గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ !

విధాత : గ్రూప్-1 నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షల అవతవకలపై 20పిటీషన్లు దాఖలయ్యాయని..విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వద్దని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని..అయితే విచారణ ముగిసి తుది తీర్పు వెలువడే వరకు పోస్టింగులు ఇవ్వొద్దని ఆదేశించింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ పరీక్షల్లో చాలా మందికి ఒకే రకంగా మార్కులు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కీలక ఆరోపణలు కూడా చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరడంతో గ్రూప్-1 నియామకాలకు బ్రేక్ పడింది.

రీవాల్యుయేషన్ కు డిమాండ్

గ్రూప్ 1పరీక్ష ఫలితాల్లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది అభ్యర్థులకు ఒకే మార్కులు, మరో వరుసలో 702 మందికి ఒకే మార్కులు రావడం సంచలనం రేపింది. కేవలం రెండు కేంద్రాల నుంచి 74 మంది టాపర్‌లు రావడం, 15 కేంద్రాల నుంచి అన్ని ర్యాంకులు రావడం సందేహాలను రేకెత్తించాయి. 563 పోస్టుల్లో టాప్ 500 ర్యాంకుల్లో ఒక్క తెలుగు మీడియం విద్యార్థి కూడా లేడని..తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షల మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని..18 రకాల సబ్జక్టులు ఉంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని పిటిషనర్లు తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని పిటిషనర్లు వాదించారు. గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌ జరిపించాలని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

కోఠి మహిళా కళాశాలలో రాసిన వారికే ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. అయితే గ్రూప్-1 పరీక్షలపై వచ్చిన ఆరోపణలను టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తోసిపుచ్చారు. మహిళలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఉండటంతో ఎక్కువ మందికి కోఠి కళాశాలనే పరీక్ష కేంద్రంగా కేటాయించామని చెప్పారు. మొత్తం గ్రూప్‌-1 మెయిన్స్‌ మహిళా అభ్యర్థుల్లో 25శాతం మంది కోఠి కాలేజీలోనే పరీక్షలు రాశారని వివరించారు. ఉర్దూ మీడియంలో 9మంది పరీక్ష రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయన్న ఆరోపణలూ అవాస్తవమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 563 మంది ఉర్దూ మీడియంలో పరీక్ష రాయగా అందులో 10 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని చెప్పారు. వారిలో ఒక్కరినే ధృవపత్రాల పరిశీలనకు పిలిచామని స్పష్టం చేశారు.

మొదటి నుంచి వివాదాలే..

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల చుట్టూ గతంలో కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. 2022, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరీక్షలు పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలపై కూడా అనుమానాలు తలెత్తాయి. అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో 563 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 2024లో జరిగిన గ్రూప్-1 పరీక్షలకు ముందు జీవో 29పై కూడా తీవ్ర వివాదం చెలరేగింది. ఈ జీవో రిజర్వేషన్ నిబంధనలను మార్చిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు కొనసాగుతోంది. గతంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలు, ఇప్పుడు ఫలితాల్లో అనుమానాస్పద అంశాలు పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకతను ప్రశ్నార్ధకం చేసింది.

Exit mobile version