Site icon vidhaatha

Ponguleti: పార్టీలో సభ్యత్వమే లేనప్పుడు.. సస్పెన్షన్ ఎక్కడిది: పొంగులేటి

విధాత బ్యూరో, ఖమ్మం: ‘ పార్టీలో నాకు సభ్యత్వమే లేదన్నారు’ సభ్యుడిని కానప్పుడు సస్పెండ్ చేసే అవకాశం ఎక్కడిది.. తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై విధంగా ప్రతిస్పందించారు. సస్పెన్షన్ వ్యవహారంపై స్పందించిన ఆయన అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థుల ఓటమికి నేను కారణమని అంటున్నవారు అదే సమయంలో తనను సస్పెండ్ చేయకుండా, నాలుగేళ్ల పాటు పార్టీలో ఎందుకు ఉంచుకున్నట్టని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఖమ్మం జిల్లాలో తనకు ఇచ్చిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.

అధికార పార్టీ సభ్యుడిగా తనకు 2900 కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కినట్లు, సొంత పార్టీ నేతలే ఇంతకాలం ఆరోపణలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచింది. నాకు ఇచ్చిన కాంట్రాక్టులకే కోట్ల రూపాయల లాభం వస్తే… 1,80,000 కోట్ల పనుల్లో ప్రభుత్వ పెద్దలకు ఎంత లాభం వచ్చినట్టని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని, ప్రజల పక్షాన పోరాడుతున్నానని జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనుల టెండర్ అతి తక్కువ ధరకు కోట్ చేసినప్పటికీ, దానిని తమ కుటుంబ సంస్థకు దక్కనీయకుండా చేసేందుకు సదరు టెండర్ రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదేనా మీ చిత్తశుద్ధి?
ఇదేనా మీ నిజాయితీ? అంటూ నిలదీశారు.

తాను బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కాలేదని, రాజకీయాల్లోకి రాకముందు నుండే కాంట్రాక్ట్ పనులు చేస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేకమంది అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారని, వారి కాంట్రాక్ట్ లావాదేవీల ప్రతి పేజీ ప్రజలకు తీసి చూపిస్తానని హెచ్చరించారు.

మీరు అధికార పార్టీని ఉపయోగించుకొని చేజిక్కించుకున్న కాంట్రాక్టుల బండారం మొత్తం బట్టబయలు చేస్తానన్నారు. ముఖ్యమంత్రి తరచూ మహారాష్ట్ర ఏకనాథ్ షిండేను ప్రస్తావిస్తుంటారు.. మరి మమ్మల్ని కొనసాగుతున్న పార్టీలకు రాజీనామా చేయించే ఆయన పార్టీలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల నుండి గెలుపొందిన ఐదుగురు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరడం ఏ ‘షిండే’ కిందకు వస్తుందన్నారు.

2014, 2018 రాజకీయంగా రెండుసార్లు దెబ్బ తిన్నాం.. ఆనాటి తప్పులను సరిదిద్దుకుంటాం వాటి నుండి గుణపాటాలు నేర్చుకున్నాం అన్నారు పొంగులేటి. అధికార పార్టీలో చేరి నష్టపోయిన రాష్ట్రంలోని అనేక మంది ఒకే ఆలోచనతో ఉన్నారని, ఉంటారని చెప్పారు.

ప్రస్తుతం తన వెంట ఉన్న అనుచరుల్లో కొద్దిమంది అధికార పార్టీ బెదిరింపులు, పెడుతున్న ఇబ్బందుల కారణంగా ఆ పార్టీలోకి వెళ్లినా, సమయం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు తమతోనే కలసి వస్తారని అన్నారు. ఏ గూటి పక్షి ఆ గూటిలోనే వాలడం సహజమేనని అన్నారు.

తాను బెదిరించో, దౌర్జన్యంగానో ఎవరిని తన వెంట రావాలని కోరలేదు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకమందికి ప్రేమ అభిమానాలు పంచానన్నారు. తన ప్రేమ అభిమానాలు పొందిన వారెవరు తనను వీడిపోరని ధీమా వ్యక్తం చేశారు.

తాను కానీ, తనను నమ్ముకున్న వారు కానీ ఏ పార్టీలో చేరాలనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందన్నారు. నాకు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎక్కువే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల గుండెల్లో ఎవరున్నారో మీకు తెలుసు.. ఏ పార్టీలోకి వెళ్లిన బీఫామ్ తెచ్చుకుంటామని నమ్మకం మాకుంది.. అందుకోసం మరో రాజకీయ వేదిక అవసరం లేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన పోరాటం కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మధ్యనే ఉంటుందని వేరే పార్టీలకు అవకాశం లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Exit mobile version