Tomato Price | సెంచరీ దాటిన టమాటా.. బెంబేలెత్తుతున్న ప్రజానీకం

Tomato Price 120 రూపాయలు దాటిన కిలో టమాట చికెన్ రేటుకు సమీపంలో ఉన్న టమాట పైపైకి పోతున్న మిగతా కూరగాయల ధరలు. కిలో బీర కాయ 140 ,మిర్చి కిలో 120 సీజన్ మొదలైనా కూరగాయల సాగుకు అనుకూలించని పరిస్థితులు. విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో జేబులో కనీసం రూ. 500 రూపాయలు ఉంటేనే మార్కెట్ కి వెళ్లే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి […]

  • Publish Date - July 2, 2023 / 10:18 AM IST

Tomato Price

  • 120 రూపాయలు దాటిన కిలో టమాట
  • చికెన్ రేటుకు సమీపంలో ఉన్న టమాట
  • పైపైకి పోతున్న మిగతా కూరగాయల ధరలు.
  • కిలో బీర కాయ 140 ,మిర్చి కిలో 120
  • సీజన్ మొదలైనా కూరగాయల సాగుకు అనుకూలించని పరిస్థితులు.

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో జేబులో కనీసం రూ. 500 రూపాయలు ఉంటేనే మార్కెట్ కి వెళ్లే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కిలో టమాట 20 నుంచి 30 రూపాయలు ఉండగా వారం పది రోజుల్లో ఐదు రెట్లు పెరగడంతో సామాన్యులు టమాట కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు.

టమాట దాదాపుగా ఇతర అన్ని కూరగాయల్లో రుచి కోసం కలిపి వండడం సర్వసాధారణం. ఏ కూరలో అయిన టమాటా మిక్స్ చేయడం మూలంగా తప్పనిసరిగా టమాటా కొనుగోలు చేస్తారు. నిగ నిగలాడే రంగు ఉన్న టమాటా ఇక ఇంట్లో లేనిదే పూట గడవదు. ముద్ద గొంతు దిగదు అనిపిస్తుంది. అయితే టమాట కొనుగోలు చేయాలంటే నిన్నా మొన్నటి వరకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసి సంచిలో కుమ్మరించుకొని ఇంటికి వెళ్లే సామాన్య ప్రజానీకం .

కాని ఇపుడు టమటాల వైపు చూడాలంటే జంకుతున్నారు. ఉన్నట్లుండి కిలో టమాట ధర 100 దాటి 120 రూపాయలకు చేరుకుంది . ఇక మేమేమి తక్కువ తిన్నామా అన్నట్లు మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశం వైపు చూస్తున్నాయి. కూరగాయల కొనుగోలు కోసం ఒకటికి రెండు సార్లు జేబులు తడుముకునే పరిస్థితి నెలకొంది. ఏది కొనాలన్నా ఆచితూచి కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా పెరిగిపోయిన కూరగాయల ధరలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు.

ముఖ్యంగా టమటా ధర మరింత పైపైకి పోతోంది. మొన్నటి వరకు 30 నుండి 40 రూపాయల వరకు ధర పలికిన టమాట ధర ఏకంగా 120 రూపాయలు దాటింది. ఎంతోసేపు బేరం చేస్తే గాని 110 రూపాయలకు కిలో టమట రావడం లేదు. అయితే ఒక్కసారిగా టమాటా ధర 120 రూపాయలు ఆపైనే పలుకుతుండ టంతో వినియోగదారులు కిలో కొనాల్సి ఉంటే పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. పావు కిలో ధర 40 రూపాయలు కిలో అయితే 120 పలుకుతుంది.

ఒకప్పుడు కిలో టమాటా ధర పాతాళానికి పడిపోయి టమాటాను రైతులు రోడ్లపై పడేసి పరిస్థితికి వచ్చి వారిని కంట నీరు పెట్టించిన అదే టమాట , ఇప్పుడు విపరీతంగా ధర పెరిగి వినియోగదారులను భయపెడుతోంది. రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్కెట్లలో 110 రూపాయల ధర ఉంటే, రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో, తోపుడు బండ్లలో ఇంకా ఐదు, పది రూపాయలు అధికంగానే పలుకుతోంది. ఈసారి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో టమటా విస్తీర్ణం తగ్గడమేకాకుండా అకాల వర్షం, వడగండ్ల వానతో ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో టమట పంట దెబ్బతిని ఈసారి టమటాకు కొరత ఏర్పడి ధర పెరగడానికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈసారి కూరగాయల సాగుకు సీజన్ ఇంకా అనుకూలించకపోవడం కూడా ధరల పెరుగుదలకు ఒకకారణమని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, తోషం, ఇచ్చోడ, తదితర చోట్ల ఎక్కువ విస్తీర్ణంలో టమాట పంట సాగవుతుంది.

ఇక్కడి నుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు కూడా టమాట ఎగుమతి అవుతుంది. ఒక్క టమాటానే కాకుండా పచ్చి మిర్చి ఇతర కూరగాయలు బీరకాయ లు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఆకాశంవైపు చూస్తున్న కూరగాయల ధరలు ఎప్పుడు కిందికి దిగివస్తాయోనని సగటు జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Latest News