Site icon vidhaatha

Uber charge | ప్రయాణికుడిని ఖంగు తినేలా చేసిన ఉబెర్.. స్క్రీన్‌ షాట్‌ వైరల్‌..!

Uber charge: కాలం మారుతోంది. కాలానికి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. అన్ని సౌకర్యాలతోపాటే రవాణా సౌకర్యాలు కూడా మెరుగయ్యాయి. ఉన్న చోటుకే వాహనాన్ని రప్పించుకుని వెళ్లాల్సిన చోటుకు వెళ్లే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులో ఉన్నది. ఖర్చు కాస్త ఎక్కువైనా టైమ్‌ కలిసొస్తుందన్న ఆలోచనతో చాలామంది ఉబెర్‌, ర్యాపిడో, ఓలా లాంటి యాప్‌ల నుంచి బైక్‌లు, ఆటోలు, కార్లు బుక్‌ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరులో రాజేష్‌ భట్టాడ్‌ అనే వ్యక్తి ఉబెర్‌లో కారు బుక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అందులో చూపించిన చార్జిని చూసి షాకయ్యాడు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ వరకు కేవలం 40 కిలోమీటర్ల దూరానికి రూ.2000 చార్జి చూపించడంతో అవాక్కయ్యాడు. క్యాబ్‌లో వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని బెంగళూరు మున్సిపాలిటీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (BMTC) కు చెందిన బస్సులో కేవలం రూ.265 చెల్లించి గమ్యానికి చేరుకున్నాడు.

అనంతరం ఉబెర్‌ యాప్‌లో చూపించిన క్యాబ్‌ చార్జికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ పోస్టు వైరల్‌గా మారింది. క్యాబ్‌ అగ్రిగేటర్‌ కంపెనీలపై నెటిజన్‌లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విమానాశ్రయాల దగ్గర చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విమానాశ్రయాల నుంచి క్యాబ్‌లలో కంటే బస్సులో వెళ్లడమే మేలని, చార్జీలు తగ్గుతాయని కామెంట్స్ చేస్తున్నారు. బస్‌ చార్జీల కంటే 10 రెట్లు ఎక్కువగా వసూలు చేయడం దారుణమన్నారు.

కాగా, గత ఏడాది కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఉబెర్ క్యాబ్‌ ఎక్కువ ఛార్జీలను వసూలు చేసిన ఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 50 కిలోమీటర్ల రైడ్‌కు రూ.4,000 వరకు వసూలు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. కాగా, తాజాగా ఉబెర్‌ చార్జీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్ వైరల్ కావడంతో సదరు క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీకి బెంగళూరు నగర రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది.

 

Exit mobile version