త‌న‌ని తిట్టిన క్రికెట‌ర్‌ని ప్రేమ‌గా హ‌గ్ చేసుకున్న కోహ్లీ.. అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడుగా..!

  • Publish Date - October 12, 2023 / 03:50 AM IST

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా భార‌త్ త‌న రెండో మ్యాచ్‌ని ఆఫ్ఘ‌నిస్తాన్‌తో ఆడిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవ‌ర్ల‌లో 272 ప‌రుగులు చేయ‌గా, ఆ లక్ష్యాన్ని 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. చాలా రోజుల త‌ర్వాత రోహిత్ శ‌ర్మ బ్యాట్ నుండి సెంచ‌రీ వ‌చ్చింది. 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శ‌ర్మ‌.. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 7 సెంచరీలు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇక క్రిస్ గేల్ 553 అంతర్జాతీయ సిక్సర్లు బాదగా ఆయ‌న‌ని రోహిత్ అధిగ‌మించాడు. ప్ర‌స్తుతం రోహిత్ శర్మ 555 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు.ఇక అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా రోహిత్ స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేశాడు.


ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ( 56 బంతుల్లో 6 ఫోర్లతో 55 పరుగులు) కూడా అద్భుతంగా బ్యాట్ చేసి భార‌త్‌కి విజ‌యాన్ని అందించాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్‌తో కోహ్లీకి గతంలో గొడవ జరగ‌గా, దానికి ప్ర‌తీకారంగా కోహ్లీ ఫ్యాన్స్ బౌల‌ర్‌ని టార్గెట్ చేసారు. నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు , ఫీల్డింగ్ చేస్తున్న‌ సమయంలోనూ కోహ్లీ కోహ్లీ అని అరుస్తూ తెగ ఇబ్బంది పెట్టారు. ఇది గమనించిన విరాట్ కోహ్లీ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ.. అత‌నిని ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని సైగ చేసాడు. దీంతో కోహ్లీ రిక్వెస్ట్‌ని అర్ధం చేసుకున్న ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు.


భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో న‌వీన్ వేసిన తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడుతూ హగ్ చేసుకోగా, కోహ్లీ సైతం అత‌నిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించి ద‌గ్గ‌ర‌కి తీసుకున్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గొడ‌వ‌కి పులిస్టాప్ ప‌డ‌న‌ట్టు అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక మ్యాచ్ ముగిసాక న‌వీన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. ఇక నుంచి స్నేహితులుగా ఉందామని నిశ్చయించుకున్నాం, మా మధ్య ఉన్న బేధాభిప్రాయాలకు ముగింపు పలుకుదామని నిర్ణయించుకున్నాం అంటూ నవీన్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. 

Latest News