Warangal
- సీఎం పదవి కాంగ్రెస్ పెట్టిన దీక్ష
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చింది
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలను నమ్మకుండా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. శుక్రవారం మానుకోట జిల్లాలో పొంగులేటి పర్యటించారు.
ముందుగా కురవిలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మానుకోట పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికంగా జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజాకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది మరిచిపోకూడదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందునే కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు.
కేసీఆర్ సీఎం కావడం కాంగ్రెస్ పార్టీ భిక్ష అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేసీఆర్ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండు పర్యాయాలు అవకాశం కల్పించారని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వచ్చేందుకు మాయమాటలు చెబుతూ సరికొత్త హామీలిచ్చేందుకు సిద్ధమవుతున్నారని, ఆయన మాయ మాటలు నమ్మి మోసపోకూడదని హెచ్చరించారు.
ఇప్పటికే కేసీఆర్ బండారం ప్రజలకు అర్ధమైందని ఈ సారి కేసీఆర్ కల్లబొల్లి మాటలకు ప్రజలు మోసపోరని అన్నారు. రైతన్నలందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావించి రుణ మాఫీ పేరుతో గారఢీ ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్, ఆదివాసీ తెలంగాణ రాష్ట్ర అధ్య-క్షువు తేజావత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాంచంద్రునాయక్, నునావత్ రాధ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.