ముంబై : వారిద్దరిది ప్రేమ వివాహం. కొంతకాలం పాటు వారి సంసార జీవితం అన్యోన్యంగా సాగింది. అయితే తన పుట్టిన రోజు వేడుకలు దుబాయ్‌లో నిర్వహించాలని భర్తను భార్య కోరింది. అది సాధ్యం కాలేదు. కనీసం బర్త్‌డే రోజు విలువైన బహుమతి ఇస్తాడేమోనని భార్య ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా జరగలేదు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య.. భర్త ముఖంపై దాడి చేసింది. ముక్కు పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని వన్‌వాడి ఏరియాకు చెందిన నిఖిల్ ఖన్నా(38), రేణుక(36) ప్రేమ వివాహం చేసుకున్నారు. నిఖిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన ఆమె బర్త్‌డే ఉండే. తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను దుబాయ్‌లో జరుపుకుందామని భర్తను కోరింది. అందుకు భర్త ఒప్పుకోలేదు. నవంబర్ 5వ తేదీన వారి పెళ్లి రోజు. ఆ రోజున విలువైన బహుమతి ఇస్తాడని రేణుక ఆశలు పెట్టుకుంది. కానీ భర్త అలాంటిదేమీ చేయలేదు. ఇక ఢిల్లీలో తన బంధువుల బర్త్‌డే వేడుకలకు వెళ్లేందుకు కూడా భార్యకు అనుమతించలేదు భర్త. ఈ క్రమంలో శుక్రవారం దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, భర్త ముఖంపై దాడి చేసింది. అతని ముక్కు పగిలిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేణుకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు