చెన్నై : ఇది ట్రయాంగిల్ లవ్.. తన చిన్ననాటి స్నేహితుడు ప్రేమిస్తున్నానని చెప్పడంతో అతనికి ఆమె ఓకే చెప్పేసింది. కానీ ట్రాన్స్‌జెండర్ అయిన అతను మరో యువకుడిని ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలిసింది. దీంతో చిన్ననాటి స్నేహితుడిని ఆమె మందలించింది. కోపం పెంచుకున్న అతను ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సజీవదహనం చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై శివారులో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నందిని(24) అనే ఓ యువతి ఐటీ ఉద్యోగిని. నందిని చిన్ననాటి స్నేహితుడు వెట్రిమారన్ అలియాస్ పంది మహేశ్వరి.. ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఇదే వెట్రిమారన్ రాహుల్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు నందినికి తెలిసింది. వెట్రిమారన్ ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది. దీంతో వెట్రిమారన్‌ను నందిని మందలించింది. ఆగ్రహావేశాలకు లోనైన వెట్రిమారన్ ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఇక నందిని బర్త్‌డే సందర్భంగా శనివారం ఆమెను బయటకు తీసుకెళ్లాడు వెట్రిమారన్. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన వెట్రిమారన్ ఆమె చేతులు గొలుసుతో కట్టేశాడు. బ్లేడుతో మణికట్టు, పాదాలు, మెడను కోసేశాడు. అనంతరం నిప్పంటించి సజీవదహనం చేశాడు.
కాలిన గాయాలతో బాధపడుతున్న నందిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నందిని, వెట్రిమారన్ మధురైకి చెందిన వారని, ఇద్దరూ కలిసి పదో తరగతి వరకు చదువుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తొరాయిపక్కంలో గత ఎనిమిది నెలల నుంచి ఐటీ కంపెనీలో ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తున్నారు.