Site icon vidhaatha

Whale | న‌డిసంద్రంలో త‌ల‌కిందుల త‌ప‌స్సు చేస్తున్న తిమింగ‌ళం.. వీడియో తీసిన యూట్యూబ‌ర్‌

Whale | విధాత‌: తోక స‌ముద్ర ఉప‌రితలంలో క‌న‌ప‌డేలా పెట్టి త‌లను నీళ్ల‌ల్లో పెట్టి త‌లకిందులుగా త‌పస్సు చేస్తున్న ఓ తిమింగ‌ళం (Whale) వీడియో వైర‌ల్ అవుతోంది. ఆస్ట్రేలియ‌న్‌ క‌యేక‌ర్ (చిన్న ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణించే ఔత్సాహికుడు), ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు బ్రాడీ మోస్ ఈ వీడియోను తీసి త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేశాడు.

త‌న క‌యేక్‌లో తెడ్డు వేసుకుంటూ స‌ముద్రంలో ప్ర‌యాణిస్తున్న మోస్‌కు న‌డి సంద్రంలో.. తోక ఒకటి పైకి వ‌చ్చిన‌ట్టు క‌నిపించింది. అది ఏంట‌ని కాస్త ద‌గ్గ‌ర‌కి వెళ్లి చూడ‌గా… ఒక భారీ తిమింగ‌ళం.. త‌ల కిందులు (Whale Tail Sailing) గా ఉన్న‌ట్లు క‌న‌ప‌డింది. ‘నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏంటి ఈ వింత?’ అని మోస్ ఆందోళ‌న చెంద‌డం వీడియోలో క‌నిపించింది.

వీడియో కొన‌సాగినంత సేపూ అది నిశ్చ‌లంగా అలా త‌ల‌కిందులుగానే ఉండిపోయింది. త‌న ద‌గ్గ‌ర అండ‌ర్ వాట‌ర్ కెమేరా ఉండ‌టంతో కాస్త దూరంగా వెళ్లి.. కెమేరాను లోప‌ల‌కు పంపాడు. అక్క‌డ క‌నిపించిన దృశ్యం అత్య‌ద్భుతం. తిమింగ‌ళం పిల్ల‌లు త‌ల్లి త‌మింగ‌ళం చుట్టూ కిచ‌కిచ‌మ‌ని అరుస్తూ సంద‌డి చేస్తున్నాయి. దీంతో ‘హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారో నాకు తెలియ‌ట్లేదు. కానీ నేను మీకు ఏ హానీ చేయ‌ను’ అని మోస్ వ్యాఖ్యానిస్తూ ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు.

ఈ వీడియోపై శాస్త్రవేత్త‌లను వివ‌ర‌ణ కోర‌గా.. వారు ఈ తిమింగ‌ళం చేస్తున్న ప్ర‌క్రియ‌ను టెయిల్ సెయిలింగ్ (తోక ఈత‌) అంటార‌ని తెలిపారు. ఈ దృశ్యం క‌నిపించ‌డం చాలా చాలా అరుద‌ని.. ఎవ‌రూ లేని అలికిడి లేని ప్ర‌శాంతంగా ఉన్న ప్రాంతంలో మాత్ర‌మే తిమింగ‌ళాలు ఈ ఫీట్ చేస్తాయ‌న్నారు. బాగా ప్ర‌యాణించిన త‌ర్వాత విశ్రాంతి తీసుకోవ‌డానికి గానీ.. లేదా త‌న పిల్ల‌ల‌ను క‌నిపెట్టుకుంటూ స‌ర‌ద‌గా ఆడుకోడానికి కానీ ఇలా చేస్తాయ‌ని పేర్కొన్నారు. సముద్ర ఉప‌రిత‌లంపై ఉన్న తోక‌.. దాని శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రిస్తూ ఉంటుంద‌ని తెలిపారు.

Exit mobile version